సంగీత దర్శకుడిగా పరిచయం అవసరం లేని పేరు ‘మిక్కీ జె.మేయర్’ (Mickey J Meyer). 18 ఏళ్ల కెరీర్లో కేవలం 42 సినిమాలు మాత్రమే చేసి కంపోజర్ గా తన ఉనికిని ఘనంగా చాటుకున్నాడు మిక్కీ. అయితే.. మిక్కీలోని మాస్ యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది మాత్రం హరీష్ శంకర్. మిక్కీ-హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో చిత్రం “మిస్టర్ బచ్చన్”. ఆగస్ట్ 15న విడుదలైన ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు మీడియాతో ముచ్చటించారు మిక్కీ జె.మేయర్. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ మరియు “కల్కి” సినిమా వదులుకోవడానికి గల కారణాలు ఆయన మాటల్లోనే..!!
మాస్ యాంగిల్ ముందు నుంచి ఉంది..
అందరూ “మిస్టర్ బచ్చన్”తోనే నేను మాస్ పాటలు కంపోజ్ చేయడం నేర్చుకున్నట్లు మాట్లాడుతున్నారు కానీ.. ఒక కంపోజర్ గా అన్నిరకాల పాటలు కంపోజ్ చేయగల సత్తా నాకుంది అని నేను నమ్ముతాను. దర్శకుడి అభిరుచి & సినిమా కంటెంట్ బట్టి నా అవుట్ పుట్ ఉంటుంది.
అందుకే ఇండియాకి షిఫ్ట్ అవ్వడం లేదు..
నన్ను ఇండియాకి షిఫ్ట్ అవ్వమని చాలామంది అడిగారు. ఇండియాలో లేకపోవడం వల్ల అవకాశాలు పోగొట్టుకుంటున్నావని స్నేహితులు హెచ్చరించారు కూడా. అయితే.. నాకు కెరీర్ కంటే ఫ్యామిలీ ఇంపార్టెంట్. నా వైఫ్ అమెరికన్ సిటిజన్, నా ముగ్గురు పిల్లలు కూడా అక్కడే చదువుకుంటున్నారు. అలాంటప్పుడు నేను ఇండియాకి కేవలం నాకోసం షిఫ్ట్ ఎందుకవ్వాలి అనిపించింది. కెరీర్ కంటే కుటుంబానికి విలువనిచ్చే మనిషిని నేను.
ఈ 18 ఏళ్లలో మ్యూజిక్ సిట్టింగ్స్ కి కూర్చున్న మొదటి సినిమా ఇదే..
నేను సంగీత దర్శకుడిగా 2005లో “పోతే పోనీ” అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టాను. అయితే.. నేను అమెరికాలో ఉండడం వల్ల మ్యూజిక్ సిట్టింగ్స్ అన్నీ ఫోన్లో లేదా వీడియో మీటింగ్స్ లో అయిపోయేవి. కానీ మొదటిసారి “మిస్టర్ బచ్చన్” కోసం హరీష్ శంకర్ తో మ్యూజిట్ సిట్టింగ్స్ లో కూర్చున్నాను. హరీష్ సియాటల్ వచ్చి ఓ వారం రోజులు నాతోనే ఉండి పాటలు కంపోజ్ చేయించుకున్నాడు.
కిక్ మిస్సయ్యి.. మిస్టర్ బచ్చన్ దొరికింది..
నిజానికి రవితేజ నటించిన “కిక్” సినిమాకి దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను సంప్రదించారు. మళ్ళీ ఫోన్ వస్తుందేమో అని వెయిట్ చేశా కానీ రాలేదు. అప్పుడు మిస్ అయిన రవితేజ సినిమా ఇన్నాళ్ల తర్వాత “మిస్టర్ బచ్చన్”తో నెరవేరడం ఆనందంగా ఉంది.
కల్కి మిస్ చేసుకున్నందుకు ఏం బాధపడడం లేదు..
“కల్కి” సినిమాకి తొలుత మ్యూజిక్ కంపోజ్ చేయాల్సింది నేనే. నాగ్ అశ్విన్ తో కొన్ని మీటింగ్స్ కూడా అయ్యాయి. అయితే.. నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సినిమా మిస్ అయ్యినందుకు నేనేమీ బాధపడడం లేదు. అలాగే.. నాగ్ అశ్విన్ తో నా అనుబంధం మునుపటిలానే ఉంది.
తెలుగు సరిగా రాకపోయినా.. తెలుగంటేనే ఇష్టం
నా ఇన్నేళ్ల కెరీర్లో వేరే భాషల్లో పని చేయడానికి చాలా అవకాశాలు వచ్చినప్పటికీ నేను మాత్రం తెలుగు సినిమాలకే పరిమితమయ్యాను. అందుకు కారణం నాకు తెలుగంటేనే ఇష్టం. నా పాటల్లో సాహిత్యం చాలా బాగుంటుందని అందరూ చెబుతుంటారు. అయితే.. పాట కంపోజ్ చేయడం వరకే కానీ నేను కనీసం లిరిక్స్ ఏమిటి అనేది కూడా తెలుసుకోను, ఎందుకంటే నాకు అర్థం కాదు కాబట్టి.
నాకు నచ్చితేనే ఒప్పుకుంటాను..
ఒక సంగీత దర్శకుడిగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోవాలి అనేందుకు నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. కథ నాకు బాగా నచ్చి, నేను కనెక్ట్ అవ్వగలిగితేనే సినిమా ఒప్పుకుంటాను. కథ నచ్చకుండా సినిమా ఒప్పుకున్న సందర్భం ఇప్పటివరకు లేదు.
అలాంటి దర్శకులతో పనిచేయడం చాలా కష్టం..
మ్యూజిక్ సెన్స్ ఉన్న డైరెక్టర్స్ తో వర్క్ చేయడం పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ.. మ్యూజిక్ గురించి కనీస స్థాయి అవగాహన లేకుండా, ఎంత మంచి ట్యూన్ ఇచ్చినా ఇంకా బెటర్ కావాలంటూ అడిగే కొందరు దర్శకులతో పని చేయడం మాత్రం చాలా కష్టం. నా కెరీర్లో ఒకసారి అలాంటి దర్శకుడితో పని చేయాల్సి వచ్చింది, అతడ్ని మెప్పించలేక సినిమాలు మానేసి ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాం అనుకునే స్థాయికి తీసుకొచ్చాడు ఆ దర్శకుడు (పేరు చెప్పలేను లెండి) అంటూ ముగించారు.