నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నెంబర్ వన్ స్టూడెంట్. అవును తన తండ్రి వెంకట నారాయణ టీచర్ కావడంతో చిన్నప్పటి నుంచి క్రమ శిక్షణతో పెరిగారు. ప్రతి క్లాసులో ఫస్ట్ వచ్చారు.19 ఏళ్లకే ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. నటనలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. టాలీవుడ్లో తనకంటూ ఓ స్టయిల్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆయన నేడు (జులై 19) 60 వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్బంగా నవ్వుల రారాజుకి ఫిల్మీ ఫోకస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయన సినీ జీవితంలో నెలకొల్పిన రికార్డుల జాబితా అందిస్తున్నాం.
1. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, బాపు దర్శకత్వంలో వచ్చిన “స్నేహం” సినిమా ద్వారా వెండి తెరపై కనిపించారు. చిన్న పాత్రలు వేస్తూ పదేళ్లకు “లేడీస్ టైలర్” గా కామెడీ హీరో అవతారమెత్తారు. తన 60 వ చిత్రానికి హీరోగా బ్రేక్ అందుకున్నారు….
2. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎక్కువమంది హీరోయిన్లను పరిచయం చేసిన ఘనత రాజేంద్ర ప్రసాద్ కే సొంతం. ఆయన సినిమాల ద్వారా 34 మంది హీరోయిన్లు తెర ప్రవేశం చేశారు.
3 . చెన్నై లో యాక్టింగ్ స్కూల్ లో శిక్షణ పొందేటప్పుడు మైమ్ చేయడంలో మన అప్పుల అప్పారావు నంబర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. తన మైమ్ తో ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటులు ఎంజే ఆర్ నుంచి అభినందనలు అందుకున్నారు.
4. ప్రముఖ దర్శకులు జంధ్యాల, వంశీ, ఈవీవీ సత్యనారాయణ, ఎస్.వి. కృష్ణా రెడ్డి, రేలంగి నరసింహా రావులతో నట కిరీటి ఎక్కువ సినిమాలు చేశారు. ఒక రేలంగి నరసింహా రావు దర్శకత్వంలోనే 32 సినిమాల్లో నటించారు.
5. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఒత్తిడిని పోగొడుతాయి. ఇదే విషయాన్ని మాజీ ప్రధాన మంత్రి పీ.వీ. నరసింహా రావు అప్పట్లో చెప్పడంతో జాతీయ మీడియాలో నట కిరిటీ పేరు మారు మోగింది.
6. కళాకారుడిగా ఎంతోమందికి ఆనందాన్ని పంచుతున్నందుకు నవ్వుల రారాజుకు ఆంధ్రా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసి గౌరవించింది. 42 ఏళ్లకే ఈ గౌరవం అందుకున్న నటుడిగా రికార్డ్ లోకి ఎక్కారు.
7. క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ లోకి ప్రవేశించారు. ఈ సినిమాకు 32 లక్షలు రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇదే రాజేంద్ర ప్రసాద్ తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్. ప్రభుత్వానికి పన్నులు కట్టి పారితోషికం తీసుకోవడం ఆయనకి మొదటి నుంచి అలవాటు.
8. ఎర్ర మందారం, ఆ నలుగురు సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్స్ అందుకున్నారు.
09. ఇప్పటి వరకు 218 చిత్రాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ కి ఆ నలుగురు సినిమాలోని రఘురాం పాత్ర అంటే చాలా ఇష్టం.
10. మేడమ్, రాంబంటు సినిమాలను సొంతంగా నిర్మించారు. ఇవి ఆర్ధికంగా లాభాలు తెచ్చి పెట్టలేక పోయిన రాజేంద్ర ప్రసాద్ కి మంచి నటుడిగా పేరును తీసుకొచ్చాయి.
11. 2015 ఎన్నికల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. పేద సినీ కళాకారులకు అండగా నిలుస్తున్నారు.
12. రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ త్వరలోనే సినిమాలో రానున్నారు. అందుకోసం కొడుకుని నటనలో శిక్షణ తీసుకోమని సూచించారు.