మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలియని వారుండరు. అతడి మార్క్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఫ్యాన్ బేస్ అలాంటిది. అటువంటి జీతూ జోసెఫ్ నుండి వచ్చిన తాజా చిత్రం “మిరాజ్”. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరి జీతూ తాజా థ్రిల్లర్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకున్న కిరణ్ (హకీమ్ షాజహాన్) ఆకస్మికంగా కనిపించకుండాపోవడంతో.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తుంది అభిరామి (అపర్ణ బాలమురళి). కిరణ్ ఓ ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడని తెలుసుకొని షాక్ అవుతుంది. ఆ షాక్ నుండి తేరుకొనేలోపు ఒక పోలీస్ ఆఫీసర్ (సంపత్ రాజ్), ఒక రౌడీ (శరవణన్), ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ (ఆసిఫ్ అలీ) అభిరామిని ఓ హార్డ్ డిస్క్ కోసం ప్రశ్నించడం మొదలుపెడతారు.
ఆ హార్డ్ డిస్క్ లో ఏముంది? కిరణ్ కి ఏమైంది? వీళ్ళందరి సహాయంతో అభిరామి ఈ ప్రమాదం నుండి బయటపడిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “మిరాజ్” చిత్రం.
నటీనటుల పనితీరు: అందరు నటీనటులు పోటీపడి మరీ నటించారు. అందరినీ డామినేట్ చేసింది మాత్రం అపర్ణ బాలమురళ్. ఆమె పాత్రకు ఉన్న లేయర్స్, వాటిని ఆమె తన కళ్లతో పండించిన విధానం సినిమా కథనాన్ని ఎలివేట్ చేశాయి.
అలాగే ఆసిఫ్ అలీ పాత్ర ఆశ్చర్యపరిచే ప్రయత్నం చేసింది. మిగతా పాత్రలు కథా గమనానికి తోడ్పడ్డాయి. ముఖ్యంగా కిరణ్ గా నటించిన హకీమ్ క్యారెక్టర్ వేరియేషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి.
సాంకేతికవర్గం పనితీరు: జీతూ జోసెఫ్ సినిమాలంటేనే స్క్రీన్ ప్లేకి పెద్ద పీట వేస్తాడు. ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులకి షాక్ ఇస్తాడు. ఈ సినిమా విషయంలోనూ అలాగే ప్లాన్ చేశాడు కానీ.. స్టేజింగ్ అనేది కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ ట్విస్టులు ఆశించిన స్థాయి షాక్ ఇవ్వవు. ముఖ్యంగా కథ మొదలుపెట్టిన విధానం చాలా రొటీన్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో వచ్చే హీరోయిన్ క్యారెక్టర్ ట్విస్ట్ మినహా ఏదీ పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయింది. అలాగే.. కథనంలోనూ వేగం లోపించింది. వరుసబెట్టి ట్విస్టులు ఉన్నప్పటికీ కథనం సాగుతున్నట్లుగా అనిపించింది అంటే కారణం స్క్రీన్ ప్లేలో ప్రాబ్లమ్స్. జీతూ ఎందుకని ఇంత పేలవమైన కథనాన్ని ఎంచుకున్నాడో అర్థం కాలేదు. ఓవరాల్ గా.. ఈసారి జీతు జోసెఫ్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయాడని చెప్పాలి.
ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు పడిన అతిజాగ్రత్త వల్ల చాలా సన్నివేశాలు అసహజంగా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ వంటివి సినిమాకి తగ్గట్లుగానే ఉన్నాయి తప్ప.. ఎక్కడా టెక్నికల్ గా సినిమాని ఎలివేట్ చేయలేదు.
విశ్లేషణ: యండమూరి, మధుబాబుల థ్రిల్లర్ నవలలు చదువుతున్నప్పుడు మనసులో ఒక రకమైన కలకలం మెదులుతుంది. మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఒక ఉత్సుకత ఉంటుంది.. తరువాత లైన్ లో ఏం ఉంటుందో అని. థ్రిల్లర్ సినిమాలు కూడా ఆ తరహా అనుభవాన్ని ఇవ్వాలి. అంతే కానీ.. ఇది ముందే ఊహించేసాం కదా, ఈ ట్విస్టులో ఏముంది? అనిపించకూడదు. “మిరాజ్” చూస్తున్నప్పుడు కలిగే భావన అదే. అటు ఆసక్తిగానూ లేక, ఇటు ఆకట్టుకోనూలేక ప్రేక్షకుల్ని సంతృపతిపరచలేక చతికిలపడింది. మరీ ముఖ్యంగా జీతూ జోసెఫ్ సినిమాల నుండి ఇలాంటివి అస్సలు ఊహించం కాబట్టి ఇంకాస్త ఎక్కువ నిరాశపడతాం.
ఫోకస్ పాయింట్: ట్విస్టులతో సాగడానికి, ట్విస్టుల కోసం సాగదీయడానికి తేడా ఉంది జీతూ!
రేటింగ్: 2/5