మిఠాయి

  • February 22, 2019 / 12:42 PM IST

ప్రస్తుతం స్టార్ కమెడియన్ హోదాను ఎంజాయ్ చేస్తున్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు కలిసి నటించిన బ్లాక్ కామెడీ ఎంటర్ టైనర్ “మిఠాయి”. టిపికల్ ప్రమోషన్స్ తో సినిమా మీద జనాలకు ఆసక్తిపెంచిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 22) విడుదలైంది. మరి ఈ డార్క్ హ్యూమర్ ఆడియన్స్ కు నచ్చుతుందో లేదో చూద్దాం..!!

కథ: సాయి (రాహుల్ రామకృష్ణ) ఒకరోజు ఆఫీస్ కి లేట్ గా వెళ్ళి బాస్ కి దొరికిపోవడం వల్ల ఉద్యోగం కోల్పోతాడు. ఆ బాధతో తన బెస్ట్ ఫ్రెండ్ జానీ (ప్రియదర్శి)తో కలిసి బార్ లో సిట్టింగ్ వేసి.. కళ్ళు బైర్లు కమ్మే స్థాయిలో తాగి.. ఇంటికి వెళ్ళి కనీసం డోర్ లాక్ చేయకుండా పడుకుండిపోతారు. ఒక దొంగ వచ్చి సాయి పెళ్లి కోసం తనకు కాబోయే భార్య కోసం చేయించిన కాస్ట్లీ నక్లెస్ తో సహా ఇంట్లో ఉన్న సామాను మొత్తం దోచుకుపోతాడు. ఆ దొంగను పట్టుకోవడంతోపాటు అతడు దోచుకున్న చైన్ ను మళ్ళీ తిరిగి సొంతం చేసుకోవడం కోసం సాయి-జానీ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? అనేది “మిఠాయి” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొదలైన ఫస్ట్ ఫ్రేమ్ నుంచి కామెడీ చేస్తున్నా అనే భ్రమలో రాహుల్ రామకృష్ణ చేసిన అతి వర్ణనాతీతమైతే.. ఆ అతిని తన టిపికల్ కామెడీ టైమింగ్ తో కంటిన్యూ చేసిన ప్రియదర్శి పెర్ఫార్మెన్స్ ఇరిటేట్ చేస్తుంది. ఇక మిగతా పాత్రధారులందరూ కుదిరినాంతలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం కోసం చాలా కృషి చేశారు. ఒక్కరి పాత్రకు కూడా క్లారిటీ ఉండదు, క్యారెక్టరైజేషన్ ఉండదు. సో, థియేటర్ నుంచి బయటకి వచ్చేప్పుడు అసలు వీళ్ళందరూ ఎందుకు అంత అతి చేశారు అనే ఆలోచన తప్ప ఒక్కడు కూడా నటించాడు అనే ఫీలింగ్ కలగదు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక్క వివేక్ సాగర్ తప్ప చెప్పుకోదగ్గ పనితనం ప్రదర్శించిన వారెవరూ లేరు సినిమాలో. రవివర్మన్ సినిమాటోగ్రఫీ ఆర్జీవీ ఫ్లాప్ సినిమాల్లోని డిజాస్టర్ ఫ్రేమ్స్ ను గుర్తుకు తెస్తే.. ప్రొడక్షన్ వేల్యూస్ షార్ట్ ఫిలిమ్ కి ఎక్కువ, ఇండిపెండెంట్ ఫిలిమ్ కి తక్కువ అన్నట్లుగా ఉన్నాయి. సినిమా మొత్తంలో ఆకట్టుకొనే అంశం ఒక్కటైనా ఉంటుందేమోనని 140 నిమిషాలు వెయిట్ చేసినా కూడా.. ఆడియన్స్ ను ఎంటర్ టైన్ లేదా ఎంగేజ్ చేసే ఒక్క సింగిల్ ఫ్రేమ్ కూడా కనిపించలేదు.

దర్శకుడు ప్రశాంత్ కుమార్ తానేదో కొత్త తరహా సినిమా తెరకెక్కిస్తున్నాను అనే అత్యుత్సాహంతో రాసుకున్న సన్నివేశాలు, వాటిని డీల్ చేసిన విధానం ప్రేక్షకుల సహనాన్ని అడుగడుగునా పరీక్షించాయి. స్లాప్ స్టిక్ కామెడీ పేరుతో నటీనటులు చేసిన తిక్క పనులు, దర్శకుడు వేయించిన వెర్రి వేషాలు చూస్తూ కూర్చోవడం నావళ్లైతే అవ్వలేదు. నేను ఈమధ్యకాలంలో థియేటర్లో కూర్చుని అసహనంతో రగిలిపోయిన సినిమా ఇదే. కథ లేదు, కథనం లేదు, క్యారెక్టర్స్ లేవు, అసలు సినిమాలో విషయం లేదు.. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అదేదో న్యూ ఏజ్ ఫిలిమ్ మేకింగ్ అంటూ ప్రేక్షకుల మెదళ్ళను ప్రయోగశాలగా భావించి చేసిన వెర్రి ప్రయోగం మాత్రం అమానుషం.

విశ్లేషణ: టైటిల్ “మిఠాయి” కదా నవ్వుల తీపి పంచుతారేమోనని పొరపాటున థియేటర్ కి వెళ్తే మాత్రం పచ్చి కాకరకాయ జ్యూస్ ను ముక్కు మూసుకోకుండా తాగడమే అవుతుంది. ఆ జ్యూస్ తాగడం కనీసం ఆరోగ్యానికి ఉపయోగం ఏమో కానీ.. ఈ సినిమా మాత్రం ఈ మెదడుకు హానికరం.

రేటింగ్: 1/5

CLICK HERE TO READ ENGLISH REVIEW

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus