ఎమ్మెల్యే

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా శ్రీను వైట్ల అసిస్టెంట్ ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఎమ్మెల్యే”. కళ్యాణ్ రామ్ సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ నేడు విడుదలైంది. కథానాయకుడిగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్ కి “ఎమ్మెల్యే” మంచి హిట్ ఇచ్చిందా లేదా అనేది చూద్దాం…!!

కథ : వీరభద్రాపురం అనే ఊర్లో గాడప్ప (రవికిషన్)తో పోటీపడి ఎమ్మెల్యేగా గెలవాలన్న ఏకైక ఆశయంతో బ్రతుకుతుంటాడు నాగప్ప (జయప్రకాష్ రెడ్డి). తన కూతురు ఇందు (కాజల్ అగర్వాల్)ని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటాననడంతో తాను, తన కొడుకు ఎమ్మెల్యే కాలేకపోయినా.. ఎమ్మెల్యే అల్లుడైనా ఇంటికొస్తాడన్న ఆనందంతో కూతురికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేయాలని ఫిక్స్ అవుతాడు.

కట్ చేస్తే… ఆ పెళ్లి ఇష్టం లేని ఇందు వీరభద్రాపురం నుంచి పారిపోయి బెంగుళూరు వెళ్లిపోతోంది. అక్కడ పరిచయమవుతాడు మంచి లక్షణాలున్న అబ్బాయి కళ్యాణ్ (కళ్యాణ్ రామ్). ఇందును చూసి ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. కానీ.. తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఎమ్మెల్యే అయ్యి తీరాలని కండిషన్ చెప్పడంతో… తాను ప్రేమించిన అమ్మాయి కోసం కాకపోయినా ఆ ఊర్లో ప్రజలు పడుతున్న కష్టాలు తీర్చడం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు కళ్యాణ్. చివరికి అతడు గెలిచాడా లేదా? గెలవడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “ఎమ్మెల్యే” కథాంశం.

నటీనటుల పనితీరు : కళ్యాణ్ రామ్ వేషధారణలో చూపిన నవ్యత, నటనలో చూపలేకపోయాడు. ఇంకా “పటాస్” ఫీవర్ నుంచి బయటకి రాలేకపోయాడని కనిపిస్తుంటుంది. ఎప్పట్లనే ఎమోషనల్ సీన్స్ లో తేలిపోయాడు. డ్యాన్స్ మాత్రం కాస్త ట్రై చేశాడు. కాజల్ క్యారెక్టర్ సినిమాలో కీలకమైనదే అయినా కూడా.. ఆమెకు పాటల కోసం, నాలుగైదు సన్నివేశాల కోసం తప్ప పెద్దగా స్క్రీన్ స్పేస్ కూడా ఇవ్వలేదు. అయితే.. పాటల్లో మాత్రం తన తొలి కథానాయకూడన్న అభిమానంతోనో ఏమో కానీ గ్లామర్ డోస్ కాస్త పెంచింది. పి.ఏగా పృధ్వీ, బావగా వెన్నెల కిషోర్, కామంతో కటకటలాడే మేనేజర్ రోల్ లో పోసాని వీలైనంత హాస్యాన్ని పండించడానికి ప్రయత్నించారు.

సాంకేతికవర్గం పనితీరు : దర్శకుడు చెప్పిన కథలో కొత్తదనం కనిపించలేదోమో మణిశర్మగారికి నేను మాత్రం కొత్త ట్యూన్స్ ఎందుకు చేయాలనుకొని సింపుల్ గా కొన్ని రీసెంట్ హిందీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ను తెలుగులో రీమిక్స్ చేసిపడేశారు. అలాగే.. నేపధ్య సంగీతం కూడా ఎక్కడో విన్నట్లే ఉంటుంది. ప్రసాద్ మురెళ్ళ సినిమాటోగ్రఫీ మాత్రం ప్రొడక్షన్ వేల్యూస్ కి అద్దం పడుతుంది. కథ, కథనంతో సంబంధం లేకుండా తనదైన కెమెరా పనితనంతో బెస్ట్ క్వాలిటీ ఔట్ పుట్ ఇచ్చారు..

ఆర్ట్ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. చాలా సన్నివేశాల్లో సన్నివేశానికి బ్యాగ్రౌండ్ కి సంబంధం ఉండదు. సినిమా చూస్తున్న ప్రేక్షకులు మధ్యలో “ఈ డైరెక్టర్ ఎవరో శ్రీనువైట్ల అసిస్టెంట్ లా ఉన్నాడు” అనుకొంటారు. నిజంగా అది నిజమే అని తెలిసేసరికి షాక్ అవుతారు. ఎందుకంటే.. ఫ్రేమింగ్స్ మాత్రమే కాదు కథనం, ట్విస్ట్స్ అన్నీ శ్రీనువైట్ల ఫార్మాట్ సినిమాలని గుర్తుకు చేయడం అందుకు కారణం. “చైల్డ్ ల్యాబర్” అనే కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని రాసుకొన్న గ్లాస్ ఫ్యాక్టరీ సన్నివేశాలు “కిక్ 2” చిత్రాన్ని గుర్తుకుతెస్తాయి. ఇక అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహా సినిమా మొత్తంలో ఆకట్టుకొనే సన్నివేశాలు ఏమీ లేకపోవడం.. సెకండాఫ్ మరీ ఫార్మాట్ సినిమాలా సాగడం మైనస్.

విశ్లేషణ : “పటాస్” తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన “షేర్, ఇజమ్” సినిమాలకంటే కాస్త బెటర్ గా ఉండే “ఎమ్మెల్యే” మెడికోర్ సినిమాలను చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది. ఆల్రెడీ థియేటర్లలో “కిరాక్ పార్టీ” కాస్త స్ట్రాంగ్ గా నడుస్తుండడమే కాక ఈవారం విడుదలైన “నీదీ నాదీ ఒకే కథ”కి మంచి పాజిటివ్ టాక్ ఉండడంతో ఏదైనా అద్భుతంగా జరిగితే తప్ప “ఎమ్మెల్యే” మంచి కమర్షియల్ విజయాన్ని అందుకోవడం కష్టం.

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus