వివాదాల నడుమ విజయాలను అందుకున్న సినిమాలు చూశాం. విజయం తర్వాత వివాదాల్లో ఇరుకున్న చిత్రాలు ఉన్నాయి. వర్మ తీసిన చిత్రం ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్(జీఎస్టీ)’ ఈ రెండింటికి మించి రికార్డు సృష్టించింది. వివాదాలతో నెట్లో విడుదలై.. నెటిజన్లను ఆకర్షించి.. పోలీసుల చేతిలో చిక్కింది. వివాదాన్ని తన మాటలతో మరింత పెద్దది చేసి ఘనవిజయం అందుకున్న వర్మ పోలీసుల ముందు దోషిగా నిలబడ్డారు. తనతో పాటు చిత్ర యూనిట్ మొత్తం ఈ కేసులో ఇరుక్కున్నారు. మహిళలను కించపరిచేలా జీఎస్టీ సినిమా తీశారని, దాని ప్రసారాన్ని నిలిపివేయాలని, సినిమా తీసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ సినిమా దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.
గత శనివారం వర్మను మూడు గంటల పాటు ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులు.. ఆధారాల కోసం మరోసారి విచారించనున్నారు. అతనితో పాటు జీఎస్టీ కి పనిచేసిన వారిని కూడా విచారించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జీఎస్టీ కి సంగీతమందించిన ఎంఎం కీరవాణికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాహుబలి వంటి గొప్ప సినిమాకి సంగీతమందించి ప్రసంశలు అందుకున్న కీరవాణి.. జీఎస్టీ వల్ల పోలీసుల ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.