69 వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో టాలీవుడ్ సినిమాలు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఈసారి జ్యూరీ సభ్యురాలిగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం శ్రీలేఖ ఉన్నారనే విషయం చాలా మందికి తెలిసుండదు. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమాల స్పెషాలిటీ కోసం ఆమె కొంచెం గట్టిగానే గొంతెత్తారు. అవార్డుల జాబితా వెల్లడించిన అనంతరం సీనియర్ సంగీత దర్శకురాలు అయిన ఎం ఎం శ్రీలేఖ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ..’నేషనల్ అవార్డుల విషయంలో తెలుగు సినిమా అంటే ఎందుకో కొంచెం నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది.
ఒకటో రెండో అవార్డులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. తెలుగు సినిమా గురించి జ్యూరీలో బలంగా నిలబడేవాళ్లు కావాలి.తెలుగు సినిమాలకి ఎందుకు అవార్డులు రావడం లేదు? ఎందుకు ఇవ్వడం లేదు? అనేది మాట్లాడగలిగేవారు ఉండాలి. విషయం ఉన్న తెలుగు సినిమాలకి అవార్డులు ఇవ్వకపోతే గట్టిగా మాట్లాడాలి అనేది భావన. విషయం లేకపోతే మాట్లాడలేం కదా. సాధారణంగా నేషనల్ అవార్డుల ఫైనల్ ప్యానల్లో భోజ్ పురి వాళ్లు ఉంటారు.
తెలుగు రాని వాళ్ళకి ‘మహానటి’ సావిత్రి వంటి గొప్ప నటీనటుల గురించి ఏం తెలుస్తుంది. అందుకోసమే జ్యూరీలో తెలుగువారు ఉండాలి.. తెలుగు సినిమా గురించి గట్టిగా మాట్లాడాలి. ఓ జ్యూరీ సభ్యురాలిగా నేను బలంగా నా అభిప్రాయాన్ని తెలిపాను. ఈసారి నేను ఏ సినిమాలకైతే అవార్డులు రావాలనుకున్నానో దాదాపు వాటికే వచ్చాయి. తొలిసారి తండ్రీ కొడుకులు కీరవాణి అన్నయ్య- కాలభైరవ ఒకే వేదికపై అవార్డులు తీసుకోనుండం అనేది నాకో గొప్ప అనుభూతి’ అంటూ (MM Srilekha) ఆమె చెప్పుకొచ్చారు.