మోహన్‌బాబు (Mohan Babu) ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమైనా బయటకు వచ్చినప్పుడు ట్రోలింగ్ భూతం అమాంతం నిద్ర లేస్తుంది. ఎక్కడెక్కడి నుండో వారి గురించి కామెంట్లు, ట్రోలింగ్‌లు బయటకు వచ్చేస్తాయి. దాని వెనుక కారణాలేంటి అనేది పక్కన పెడితే.. వాటి గురించి మోహన్‌బాబు ఎలా తీసుకుంటారు అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ట్రోలింగ్‌లను పట్టించుకోనని క్లారిటీ ఇచ్చేశారు మోహన్‌బాబు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తన బాల్యం, నట జీవితం గురించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు.
1975లో ‘స్వర్గం – నరకం’ సినిమాతో విలన్‌గా పరిచయం అయి, ఇప్పటివరకు అంటే 50 ఏళ్లు నటుడిగానే కొనసాగుతున్నానని చెప్పుకొచ్చారు మోహన్‌బాబు. అలా 560 సినిమాల్లో నటించానని గుర్తు చేసుకున్నారాయన. నటుడిగా ఉన్న రోజుల్లోనే ‘ప్రతిజ్ఞ’ సినిమాతో నిర్మాతగా మారానని, ఆ బ్యానర్‌ను నందమూరి తారకరామారావు (Sr NTR) ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. అదే బ్యానర్‌పై ఎన్టీఆర్ హీరోగా ‘మేజర్ చంద్రకాంత్’ తీశానని తెలిపారు.
ఆ సినిమా సమయంలో ఆస్తులు అన్నీ తాకట్టు పెట్టిమరీ ఆ సినిమాకు పెట్టానని తెలిపారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వద్దని చెప్పినా తాను మొండిగా వినలేదని, కానీ విజయం సాధించానని చెప్పారు. ఇక తనకు ఆవేశం ఎక్కువే అని, అలా అని తాను ఎప్పుడూ ఇతరులకు అపకారం చేయలేదని చెప్పారు. అయితే తనను ఎంతోమంది మోసం చేశారని చెప్పుకొచ్చాడు. అప్పటి నుండే ఈ ఆవేశం వచ్చిందని, ఆ ఆవేశమే నష్టాన్ని కలిగించిందని చెప్పారాయన.
ఇక ట్రోలింగ్ సంగతి చూస్తే.. పక్కవారు నాశనం అవ్వాలని ఎప్పుడూ కోరుకోకూడదని, అలా కోరుకుంటే వారి కంటే ముందు మనం నాశనమవుతామని చెప్పుకొచ్చారాయన. ట్రోలింగ్ వల్ల వాళ్లకు ఏం ఆనందం వస్తుందో అర్థం కాదు. అయితే ఈ విషయంలో నేను ఎవరినీ నిందించను అని అన్నారు మోహన్ బాబు.