‘మీకు అవార్డొచ్చింది.. ఫలానా రోజు దిల్లీ వచ్చి అందుకోండి’… ఈ మాటలు వింటే మీకేమనిపిస్తుంది చెప్పండి. కచ్చితంగా ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని.. నాకు ఎందుకు అవార్డు వస్తుంది అని అనుకుంటారు. అయితే ప్రముఖ నటుడు మోహన్‌లాల్ కూడా ఇలానే అనుకున్నారు. మీకు దాదాసాహేబ్ ఫాల్కే అవార్డు వచ్చింది అని అవతలి వ్యక్తి ఫోన్‌లో చెబితే లాలెటన్ ఏకంగా ఇది జోక్ అయి ఉండొచ్చు అని అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
ప్రతిష్ఠాత్మక దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇటీవల మోహన్‌లాల్ కొచ్చిలో ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మీరు దాదాసాహెబ్ అవార్డుకు ఎంపికయ్యారంటూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే నేను నమ్మలేకపోయాను. కలలో ఉన్నానేమో అనుకొని ఆ విషయాన్ని మరోసారి చెప్పండి అన్నాను అని మోహన్ లాల్ చెప్పారు. ఇక ఈ పురస్కారం మలయాళ సినిమాకు వచ్చిన అవార్డుగా భావిస్తానని తెలిపారు.
నిజాయతీగా పనిచేయడం, భగవంతుడి ఆశీస్సుల వల్లే ఈ పురస్కారం వచ్చిందని అనుకుంటున్నాను. ఈ అవార్డు నాకు మాత్రమే సొంతం కాదు. నన్ను అభిమానించే అందరికీ ఈ అవార్డు చెందుతుంది. ఈ సినిమా పరిశ్రమలో ఎంతో మంది గొప్ప వ్యక్తులు ప్రయాణించిన దారిలోనే నేనూ నడిచాను. నేనేం సాధించినా దానికి కారణం వారుకూడా. నా సినీ ప్రయాణంలో నేను కలసి పనిచేసిన కొందరు వ్యక్తులు ఇప్పుడు లేరు. కానీ ఆ జ్ఞాపకాలెప్పుడూ నాతోనే ఉంటాయి అని చెప్పారు.
ఈ సందర్భంగా ఓ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త బయటకు వచ్చింది. ‘ఒప్పం’, ‘మిన్నారం’, ‘మిథునం’, ‘కాలాపానీ’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ మరోసారి కలసి పని చేయబోతున్నారు. తన 100వ సినిమాను మోహన్‌లాల్‌తోనే చేస్తానని ప్రియదర్శన్ తెలిపారు. ఇప్పటివరకు వైవిధ్యమైన సినిమాలు చేసిన ఈ కాంబో ఇప్పుడు ఎలాంటి కథ ఎంచుకుంటుందో చూడాలి..