నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడు అని ప్రత్యేకంగా ఎవరూ చెప్పక్కర్లేదు. అయితే ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం కచ్చితంగా చెప్పాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఓసారి అనౌన్స్‌మెంట్ వచ్చినా ఎందుకో కానీ ఆ సినిమాకు ఇప్పటివరకు కొబ్బరికాయ కొట్లేదు. దీనికి చాలా కారణాలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నా.. ఏదీ తేలడం లేదు. రీసెంట్ మోక్షు కొత్త సినిమా ఇదే అవ్వొచ్చు అంటూ మరో కొత్త రూమర్ బయలుదేరింది. ఈ క్రమంలో కొత్త లుక్ ఒకటి బయటకు వచ్చింది.
మోక్షజ్ఞ కొన్నేళ్ల క్రితం విదేశాలకు చదవడానికి వెళ్లినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు బొద్దుగా ఉండేవాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. దీంతో సినిమాల్లోకి డెబ్యూ ఇవ్వడానికి చాలా సమయం పట్టేలా ఉంది అని అనుకున్నారంతా. అనుకున్నట్లుగా టైమ్ తీసుకొని హీరోల లుక్‌లోకి వచ్చాడు. అయితే కటౌట్ చూసినప్పుడు ఎక్కడో చిన్న అసంతృప్తి అయితే ఉండేది నందమూరి ఫ్యాన్స్‌లో. ఇప్పుడు దానిని కూడా క్లియర్ చేసే పనిలో పడ్డారు.
ఈ క్రమంలో మరింత బక్కగా మారిన మోక్షజ్ఞ పిక్ ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఏదో ఫంక్షన్‌లో ఉన్న మోక్షజ్ఞ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని బట్టి చూస్తే ఇప్పటితరం హీరోల్లా కనిపిస్తున్నాడు. దీంతో సినిమా త్వరలో ప్రారంభమవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే అది తొలుత ప్రకటించినట్లుగా ప్రశాంత్ వర్మ డైరక్షన్‌లోనా? లేక కొత్తగా వచ్చిన పుకార్ల ప్రకారం క్రిష్ దర్శకత్వంలోనా అనేది తెలియాల్సి ఉంది.
బాలకృష్ణ కలల సినిమా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అంటున్నారు. బాలయ్య బ్లాక్‌బస్టర్ హిట్లలో ఒకటైన ‘ఆదిత్య 369’కి ఇది సీక్వెల్. బాలయ్య రాసుకున్న కథతో క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాను రూపొందిస్తారని లేటెస్ట్ సమాచారం. తొలుత ఈ సినిమాలో బాలయ్య స్వీయ దర్శకత్వంలో నటిస్తానని చెప్పారు.