మంచు వారసులు మధ్య ఏర్పడిన అగాధం తగ్గుతోందా? ఇద్దరూ మళ్లీ ఒక్కటవ్వబోతున్నారా? ఇప్పటికి జరిగింది చాలు ఇక మనం మనం ఒక్కటే అని అనుకున్నారా? ఏమో మంచు మనోజ్ రీసెంట్‌గా చేసిన ఓ ఎక్స్ పోస్ట్ చూస్తే అలానే అనిపిస్తోంది. మంచు కుటుంబం కొత్త తరం ఇటీవల సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మోహన్‌బాబు మనవడు అవ్రామ్ ఇటీవల ‘కన్నప్ప’ సినిమాతో బాల నటుడిగా ఎంటర్ అయ్యాడు. ఆ సినిమాలోని నటనకుగాను అవ్రామ్‌కు ఓ సినిమా అవార్డుల ఫంక్షన్‌లో అవార్డు వచ్చింది.
అవ్రామ్‌కు అవార్డు వచ్చిన విషయాన్ని మంచు విష్ణు ఎక్స్ ద్వారా ఓ వీడియో పోస్ట్ చేసి తెలిపాడు. దానికి మంచు మనోజ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కంగ్రాట్స్ అవ్రామ్.. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. నువ్వు ఇలాగే మరింత రాణించాలి. మంచు విష్ణు అన్న, నాన్న మోహన్ బాబుగారితో కలసి అవార్డు అందుకోవడం నీకు ప్రత్యేకం’’ అని ఆ పోస్టులో రాసుకొచ్చారు. మంచు విష్ణు అన్న అంటూ మనోజ్ పోస్టులో రాయడంతో అంతా సమసిపోయినట్లేనా అనే చర్చ మొదలైంది.
గతకొన్ని రోజులుగా మంచు కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి అందరికీ తెలిసిందే. ఆ పరిణామాలకు మోహన్‌బాబు యూనివర్సిటీలో జరుగుతున్న కొన్ని విషయాలు అని మనోజ్ చెబుతుంటే.. కాదు కాదు ఆస్తికి సంబంధించిన అంశాలు అని అవతలి వర్గం చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది అనే క్లారిటీ లేకుండా పోయింది. ఇక మొన్నీమధ్య ‘కన్నప్ప’ సినిమా విడుదల సందర్భంగా మనోజ్ పెట్టిన పోస్టులో విష్ణు పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం.
అలాంటిది ఇప్పుడు విష్ణు పేరు పెట్టి, అన్న అంటూ సంబోధించడం చూస్తుంటే ఇద్దరి మధ్య అంతా కుదురుకుంది అని చెప్పొచ్చు. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.