ఒక పెద్ద స్టార్ హీరో కుటుంబం నుండి ఓ హీరో ఎంట్రీ ఇస్తున్నాడు అంటే ఎంత సీరియస్‌గా ఉండాలి. సినిమా కథ నుండి కాస్టింగ్ వరకు, సినిమా టీమ్ నుండి లొకేషన్ల వరకు ఇలా చాలా విషయాల్లో జాగ్రత్తలు అవసరం. ఇలా చూసుకోకుండా ఎంట్రీ ఇచ్చిన హీరోలు నిలదొక్కుకోవడానికి ఇబ్బందిపడటం మనం చూశాం. అయితే ఈ క్రమంలో లేనిపోని ఆలోచనలకు పోయి, ఇంకా చెప్పాలంటే అతి జాగ్రత్తలకు పోయి విలువైన కాలం వృథా చేసుకోవడమూ తప్పే.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, కొంతమంది నందమూరి అభిమానుల్లో ఈ చర్చే జరుగుతోంది. కారణం నందమూరి వంశం వారసుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఆలస్యం అవుతుండటమే. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ‘మోక్షజ్ఞ సినిమా’ అంటూ ఓ రూమర్ వచ్చింది. ఆ తర్వాత అది రూమర్ కాదు నిజమే అంటూ అసలు విషయం చెప్పారు బాలయ్య. 2017లో ఆ టాక్ వస్తే… ఇప్పుడు 2024. ఇంతవరకు ఈ విషయంలో ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు లేటు అనే చర్చ నడుస్తోంది.
మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ మామూలుగా ఉండకూడదు అందుకే ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో లాంచ్ చేస్తారు అని ఆ మధ్య వార్తలొచ్చాయి. అనుకున్నట్లుగానే బాలకృష్ణ కూడా అదే మాట చెప్పారు. దీంతో తండ్రి చేతిలో లాంచ్ అవ్వనున్న కొడుకు అని రాసుకున్నారు అంతా. కానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. ఆ తర్వాత చాలామంది దర్శకుల పేర్లు వినిపించాయి. బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్, రాహుల్ సాంకృత్యాన్ ఇలా చాలా మంది దర్శకుల పేర్లు వచ్చాయి.
ఇప్పుడు మళ్లీ బోయపాటి శ్రీను పేరు వినిపిస్తోంది. (Mokshagna) మోక్షజ్ఞ వస్తే మాస్ హీరోగానే ఇండస్ట్రీలోకి రావాలనేది బాలయ్య ఆలోచనట. అందుకే సరైన కథ కోసం చూస్తున్నారు. అది ‘అఖండ 2’ అని కొంతమంది అంటుంటే.. కాదు కాదు కొత్త కథ అని మరికొందరు అంటున్నారు. అయితే మరి ‘ఆదిత్య 369’ సీక్వెల్ ఏమైంది అనేది తెలియాలి. చూడాలి మరి బాలయ్య ముహూర్తం ఎప్పుడు పెడతారో?