2019 వ సంవత్సరంలో కచ్చితంగా హిట్ అవుతాయి అనుకున్న ఎన్నో సినిమాలు ప్లాప్ అయితే.. అసలు అంచనాలే లేని సినిమాలు సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ ఏడాది ఆరంభం నుండే స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్ లు గా నిలిచి అందరినీ షాక్ గురిచేశాయి. మా హీరో సినిమా కచ్చితంగా హిట్ అవ్వడమే కాకుండా రికార్డులు బద్దలు కొడతాయి అనే విధంగా అభిమానులు ఫిక్సయితే వారికి నిరాశ తప్పలేదు. అలా ఈ ఏడాది కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ లు గా మిగిలిన సినిమాల్ని ఓ లుక్కేద్దాం రండి
1) ఎన్టీఆర్ కథానాయకుడు : దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు అయిన నందమూరి తారకరామా రావు జీవిత చరిత్రతో రూపొందిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మంచి రివ్యూ లు వచ్చినప్పటికీ.. కల్లెక్షన్లని రాబట్టలేక పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.
2) వినయ విధేయ రామా : ‘రంగస్థలం’ వంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన రాంచరణ్.. మాస్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రెస్స్ అయిన దర్శకుడు బోయపాటి సినిమా అంటే.. ‘హిట్ అనే మాట పక్కన పెట్టి ఎన్ని రికార్డులు కొడుతుందా’ అనే ఆలోచిస్తాం. కానీ కట్ చేస్తే సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
3) మిస్టర్ మజ్ను : ‘హలో’ చిత్రం పర్వాలేదనిపించుకున్నప్పటికీ.. కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. అయితే ‘తొలిప్రేమ’ (2018 వరుణ్ తేజ్) వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్లో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. కచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది అని ఆశపడిన వారికి నిరాశ తప్పలేదు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది.
4) ఎన్టీఆర్ మహానాయకుడు : మొదటి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో ట్రాజెడీ మిస్సవ్వడం వల్ల డిజాస్టర్ అయ్యింది.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రంతో అయినా హిట్ కొట్టి.. క్రిష్, బాలయ్య లు.. పెద్దాయన పరువు నిలబెడతారు అనుకుంటే.. ఈ చిత్రం మొదటి భాగం కంటే 5 రేట్లు ఎక్కువగా డిజాస్టర్ అయ్యింది.
5) వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి : బాలీవుడ్ లో రాణించలేకపోయిన రాయ్ లక్ష్మీ.. ఈసారైనా హిట్ అందుకుంటుంది అనుకుంటే.. అబ్బే డిజాస్టర్ తప్పలేదు.ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మి’ చిత్రం కూడా డిజాస్టర్ గానే మిగిలింది.
6) సూర్యకాంతం : మొదటి సినిమా నుండీ ఓ హిట్టు కోసం ఎంతో ఆశతో కష్టపడుతున్న మెగా డాటర్ నిహారిక కు.. ‘సూర్యకాంతం’ చిత్రం వాటిని మించిన డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది.
7) ప్రేమ కథా చిత్రం 2 : ‘ప్రేమ కథా చిత్రం’ చిత్రం సినిమా చిన్న సినిమాగా వచ్చినప్పటికీ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం 2’ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యి.. ‘ప్రేమ కథా చిత్రం’ పరువు తీసిందనే చెప్పాలి.
8) ఎబిసిడి : అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ‘ఎబిసిడి’ చిత్రం పెద్ద హిట్ అయ్యి.. శిరీష్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుంది అనుకుంటే.. తీవ్రంగా నిరాశపరిచింది.
9) సీత : తేజ డైరెక్షన్లో కాజల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ ‘సీత’ చిత్రం టీజర్, ట్రైలర్లతో ఎన్నో అంచనాలు క్రియేట్ చేసింది. కానీ సినిమాలో అంత మ్యాటర్ లేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది.
10) కల్కి : ‘పి.ఎస్.వి గరుడవేగ’ చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చిన రాజశేఖర్.. ఆయన తరువాతి సినిమా కూడా అదేస్థాయిలో ఉంటుంది అని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. ‘అ!’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రంలో మితిమీరిన యాక్షన్ సన్నివేశాలు పెట్టి విసిగించాడు. ఫలితంగా సినిమా డిజాస్టర్ అయ్యింది.
11) డియర్ కామ్రేడ్ : విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. భరత్ కమ్మా డైరెక్షన్ మరీ నీరసంగా ఉండడంతో జనాలు ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు.
12) కథనం : బుల్లితెర పై ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ.. తనకు సూటయ్యే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులని అలరిస్తూ వచ్చింది. దాదాపు ఈమె నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘క్షణం’ ‘రంగస్థలం’ ‘ఎఫ్2’ ‘యాత్ర’ వంటి అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కానీ అటు తరువాత వచ్చిన ‘కథనం’ చిత్రం మాత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది.
13) మన్మధుడు2 : నాగార్జున ఆల్ టైం హిట్ ‘మన్మధుడు’ సీక్వెల్ క్రేజ్ తో వచ్చిన ‘మన్మధుడు2’ కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ‘చిలసౌ’ చిత్రంతో నేషనల్ అవార్డు కొట్టిన డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కు ఈ చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది.
14) రణరంగం : శర్వానంద్ టైం ఈ మధ్యన అస్సలు బాగున్నట్టు లేదు. గత ఏడాది ‘పడి పడి లేచె మనసు’.. ఈ ఏడాది ‘రణరంగం’ చిత్రాలతో పెద్ద డిజాస్టర్లను అందుకున్నాడు.
15) సాహో : ‘బాహుబలి’ సిరీస్ తరువాత ప్రభాస్ నటించిన సినిమా ‘సాహో’ చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ సుజీత్ ఇంటెలిజెన్స్ డైరెక్షన్ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. తెలుగులో డిజాస్టర్ అయిన ఈ చిత్రం బాలీవుడ్ లో మాత్రం హిట్ గా నిలిచింది.
16) సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ 151 వ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు పర్వాలేదనిపించినా కానీ.. పాన్ ఇండియా లెవెల్లో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచిన తీరు కొందరిని ఆకట్టుకున్నప్పటికీ.. మెగాస్టార్ చిత్రం నుండీ ట్రాజెడీ క్లయిమాక్స్ ను మరికొంత మంది యాక్సెప్ట్ చేయలేకపోయారనే చెప్పాలి.
17) చాణక్య : గత కొంత కాలంగా ప్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ ఈసారి హిట్ కొడతాడు అనుకుంటే.. ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది.
18) ఆర్.డి.ఎక్స్ లవ్ : ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న పాయల్.. ‘ఆర్.డి.ఎక్స్ లవ్’ చిత్రంతో మాత్రం డిజాస్టర్ అందుకుంది.
19) హిప్పీ : ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ పరిస్థితి కూడా ఇంతే. ఆ చిత్రం తరువాత వచ్చిన హిప్పీ చిత్రం పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.. అయితే తరువాత వచ్చిన ‘గుణ 369′ ’90 ఎం.ఎల్’ చిత్రాలు కమర్షియల్ గా పర్వాలేదనిపించాయి.
20) యాక్షన్ : తెలుగు రాష్ట్రాల్లో విశాల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ‘యాక్షన్’ చిత్రాన్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈ చిత్రం డిజాస్టర్ గా మిగిలింది.
21) ఆవిరి : క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన ‘ఆవిరి’ చిత్రం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడంతో ఈ చిత్రాన్ని జనాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది.
22) దేవ్ : కార్తీ సినిమాలకి కూడా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. కానీ ‘దేవ్’ చిత్రం కనీసం ఆకట్టుకోలేకపోవడంతో డిజాస్టర్ గా మిగిలింది. కానీ ‘ఖైదీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు.
23) ఎన్జీకే : సూర్య హీరోగా సెల్వరాఘవన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఎన్జీకే’ చిత్రం కూడా డిజాస్టర్ గా మిగిలింది. కనీసం సాయి పల్లవి, రకుల్ ప్రీత్ ల క్రేజ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది.
24) బందోబస్త్ : సూర్య, మోహన్ లాల్, ఆర్య వంటి స్టార్లు ఈ చిత్రంలో నటించారు. తెలుగులో కూడా వీళ్ళకి మంచి క్రేజ్ ఉంది. అయినా కూడా ఈ చిత్రం ఎందుకో పెద్ద డిజాస్టర్ అయ్యింది.
25) రాగాల 24 గంటల్లో : హీరోయిన్ ఈషా రెబ్బా కు మంచి క్రేజ్ ఉంది.. హీరో సత్యదేవ్ కూడా మంచి సినిమాలు చేస్తాడు అనే నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. కానీ వీళ్ళిద్దరూ కలిసి నటించిన ‘రాగాల 24 గంటల్లో’ చిత్రం మాత్రం కనీసం వసూళ్ళను రాబట్టలేకపోయింది.
26) తిప్పరా మీసం : ఈఏడాది ‘బ్రోచేవారెవరురా’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన శ్రీవిష్ణు.. ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ‘తిప్పరామీసం’ వంటి డిజాస్టర్ కూడా ఇచ్చాడు.