2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

కరోనా కారణంగా ఈ ఏడాది విడుదలైన సినిమా లిస్ట్ తగ్గింది కానీ.. ఫ్లాప్ సినిమాల కౌంట్ మాత్రం తగ్గలేదు. పూరీ జగన్నాధ్ అన్నట్లు సినిమా ఇండస్ట్రీని బ్రతికిస్తున్నది ఫ్లాప్ సినిమాలే. కానీ.. సదరు సినిమాల వల్ల మెల్లమెల్లగా ప్రేక్షకులు థియేటర్ల నుంచి దూరమవుతున్నారు అనేది కూడా అంతే నిజం. ఈ విషయంలో డిబేట్ అనవసరం కానీ.. ఈ ఏడాది జనాల్ని “అమ్మబాబోయ్ ఇదేం సినిమారా బాబు” అనిపించిన సినిమాల లిస్ట్ ఒకసారి చూసేద్దాం.

1.ఎంత మంచివాడవురా

శ్రీనివాస కళ్యాణం అనే కాస్ట్లీ పెళ్లి డీవీడీతోనే ప్రేక్షకుల్ని భయపెట్టిన సతీష్ వేగేశ్నకు దొరికిన చక్కని అవకాశం “ఎంత మంచివాడవురా”. ఆదిత్య మ్యూజిక్ సంస్థ నిర్మాణ రంగంలోకి దిగి మరీ నిర్మించిన సినిమా ఇది. కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాయి. అయితే.. సినిమా మాత్రం అమ్మబాబోయ్ అనిపించింది. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్లు రిలేషన్స్ ను ఆర్డర్ చేసి తెప్పించుకోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం “ఆక్సిజన్” అనే గుజరాతీ చిత్రానికి రీమేక్ కావడం విశేషం.

2.డిస్కో రాజా

రవితేజ కెరీర్ లో అసలు ట్రైలర్ అనేది రిలీజ్ చేయకుండా విడుదలైన సినిమా ఇదే. రెండు పాటలు హిట్, విడుదలైన టీజర్లు హిట్, రవితేజ గెటప్, వి.ఐ.ఆనంద్ ట్రాక్ రికార్డ్ ఇలా అన్ని పాజిటివ్ గా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రీకొడుకులు ఒకే వయసు వారు కావడం అనే కాన్సెప్ట్ మంచి హైప్ తెచ్చింది. అయితే.. ఏం లాభం లాజిక్స్ సరిగా సింక్ అవ్వకపోవడం, అనవసర పాయింట్స్ ఎక్కువవడంతో కథ ట్రాక్ తప్పి డిజాస్టర్ గా మారింది. అమ్మ బాబోయ్ అనిపించలేదు కానీ.. థియేటర్ల నుంచి బయటకు వచ్చినోళ్ళు మాత్రం “అరేయ్ ఏంట్రా ఇది?” అని బుర్ర గోక్కునేలా చేసింది.

3.వరల్డ్ ఫేమస్ లవర్

ప్రీరిలీజ్ ఈవెంట్ లో కొండన్న అలియాస్ విజయ్ దేవరకొండ “సిక్స్ కొడతాను” అంటూ ఇచ్చిన స్పీచ్ చూసి “అమ్మడియమ్మ హిట్ కన్ఫర్మ్” అని ఫిక్స్ అయిపోయారు జనాలు. అర్జున్ రెడ్డి ఫ్లేవర్ ట్రైలర్ అండ్ విజయ్ గెటప్స్, ముగ్గురు హీరోయిన్స్ ఇలా అన్ని మంచి ఆసక్తి రేపాయి. అయితే.. థియేటర్లలో మాత్రం జనాలు నీరసపడిపోయారు, కొందరు మధ్యలోనే పారిపోయారు కూడా. ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ చిత్రాన్ని నిరభ్యంతరంగా పేర్కొనవచ్చు.

4.ఓ పిట్ట కథ

నటీనటులందరూ కొత్తవాళ్లే అయినప్పటికీ.. బ్రహ్మాజీ తన కొడుకు కోసం తనకు తెలిసిన సెలబ్రిటీలందరి చేత పబ్లిసిటీ చేయించి మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా “ఓ పిట్ట కథ”. టీజర్, ట్రైలర్ కూడా బాగానే ఉన్నాయి. అయితే.. ట్రైలర్ ఉన్నంత ఆసక్తికరంగా సినిమా లేదు. పైగా.. హీరో ఎక్స్ ప్రెషన్ అర్ధం చేసుకోవడానికి ఆడియన్స్ చాలా ఇబ్బందిపడాల్సి వచ్చింది కూడా. థియేటర్లలో విడుదలైన మూడు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైందీ సినిమా.

5.పెంగ్విన్

ఓపికపట్టి రెండు సార్లు చూసినా ఇప్పటికీ సినిమాకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు. సినిమా కూడా అర్ధం కాదు అది వేరే విషయం అనుకోండి. “మహానటి” అనంతరం కీర్తి సురేష్ నటించగా విడుదలవుతున్న సినిమా కావడంతో మంచి హైప్ ఉండింది సినిమా మీద. టీజర్ కూడా బాగానే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కానీ.. అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూస్తున్నంతసేపు మాత్రం అసలు కీర్తి ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏమై ఉంటుంది, అసలు రిథమ్ అనే పేరేంటి?, ఈ డైరెక్టర్ “హిట్” సినిమా చూసిన తర్వాత ఈ కథ రాసుకున్నాడా లేక ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఒకే కొరియన్ సినిమా చూసి కథ రాసుకున్నారా అని చాలా ఆలోచనలు వచ్చేస్తుంటాయి లెండి. సినిమాలో మనుషుల నటన కంటే కుక్క పెర్ఫార్మెన్స్ హైలైట్ అయ్యిందంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా ఏ స్థాయిలో ఉందో.

6.వి

నాని 25వ చిత్రం, తొలిసారిగా నాని నెగిటివ్ రోల్ ప్లే చేస్తున్న సినిమా. “సమ్మోహనం” లాంటి బ్యూటీఫుల్ హిట్ తర్వాత ఇంద్రగంటి తీసిన సినిమా. ఇలా చాలా అంశాలు “వి” సినిమా మీద విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. ఆ అంచనాలన్నీ సినిమా విడుదలయ్యాక తలకిందులయ్యాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్ బాగానే ఉన్నా.. కథ-కథనాల్లో దమ్ము లేకపోవడం, బలవంతపు కామెడీ సీన్లు, చాలాసార్లు చూసేసిన సినిమాలను గుర్తుచేయడం వంటి వాటి వల్ల “వి” వ్యూస్ పరంగా హిట్ అయ్యుండొచ్చు కానీ.. ఆడియన్స్ ను మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

7.నిశ్శబ్దం

“భాగమతి” లాంటి సూపర్ హిట్ అనంతరం అనుష్క నటించిన సినిమా “నిశ్శబ్దం”. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల లాంటి మంచి ట్యాలెంటెడ్ టీమ్ ఉన్న సినిమా ఇది. ఒక్క అనుష్క తప్ప, సినిమాకి బజ్ క్రియేట్ చేయగలిగే అంశం ఒక్కటి కూడా లేదు ఈ సినిమాలో. అసలు ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయాలా లేక ఓటీటీలో రిలీజ్ చేయాలా అనే విషయంలో జరిగిన రచ్చ, థియేటర్లలో మాత్రమే విడుదల చేస్తాం అని కోన వెంకట్ చూపిన మేకపోతు గాంభీర్యం చూసి ప్రేక్షకులు కూడా సినిమా బాగుంటుందేమో అనుకున్నారు. కట్ చేస్తే.. సినిమా విడుదలయ్యాక నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రేక్షకుడు.

8.ఒరేయ్ బుజ్జిగా

ఆహా యాప్ లో సూపర్ హిట్ అయిపొయింది అని దర్శకనిర్మాతలు ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా.. ప్రేక్షకుల్ని కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందీ చిత్రమని చెప్పాలి. దర్శకుడు ఇంకా కుళ్ళు విలేజ్ కామెడీలు, మ్యాటర్ లేని కన్ఫ్యూజన్ డ్రామాలు, పసలేని సింగిల్ లైన్ పంచ్ లను నమ్ముకొని సినిమా తీయడం అనేది హాస్యాస్పదం.

9.మా వింతగాధ వినుమా

ఎప్పుడు తీశారో తెలియదు కానీ సడన్ గా రిలీజ్ అయిపోయిన సినిమా “మా వింతగాధ వినుమా”. “కృష్ణ అండ్ హిజ్ లీలా” ఓటీటీలో విడుదలై హిట్ అయ్యేసరికి.. ఇది కూడా ఆడేస్తది అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమా రిలీజ్ చేసేసారు. ప్రేక్షకులు కూడా అదే ఉత్సాహంతో సినిమా చూసారు కూడా. అయితే.. సినిమా మొదట్లో ఉన్న ఉత్సాహం, ఇంటర్వెల్ తర్వాత నీరుగారిపోయింది. హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రానికి రైటర్, ఎడిటర్ కూడా కావడం గమనార్హం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus