ఈ ఏడాది ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేసిన చిత్రాల సంఖ్య ఎక్కువే!

  • December 29, 2022 / 11:10 AM IST

సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సర్వసాధారణం. అయితే.. టీజర్లు, ట్రైలర్లు లేదా కాంబినేషన్లతో మంచి ఆశలు రేకెత్తించి.. సినిమాలుగా ప్రేక్షకుల్ని నిరాశకు గురిచేసిన సినిమాల సంఖ్య ఎక్కువే. మరి అలా డిజప్పాయింట్ చేసిన సినిమాలేమీటో చూద్దాం..!!

ఖిలాడి

అసలు రవితేజ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనేది ఇప్పటికీ ఎవరికీ అర్ధం కాని ఓ ప్రశ్న. రవితేజ ఖాతాలో బ్యాడ్ మూవీస్ కూడా ఉన్నాయి. కానీ.. అతడి కెరీర్ లో వరస్ట్ మూవీగా ఖిలాడి నిలుస్తుంది. విడుదలకు నోచుకోని ఓ తమిళ సినిమా కథకు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి ఓవర్ ఎక్స్ పోజింగ్, అనసూయ & మీనాక్షీ చౌదరి అన్ నేససరీ గ్లామర్ షో తప్ప ఇంకేం ఉన్నాయా అని భూతద్ధం పెట్టి వెతికినా ఏమీ కనిపించవు. ఒక కమర్షియల్ థ్రిల్లర్ ను ఎలా తీయకూడదు అనేందుకు చక్కని ఉదాహరణ ఈ చిత్రం.

OTT Platform: Hotstar

సన్ ఆఫ్ ఇండియా

డైమెండ్ రత్నబాబు మీమర్స్ కి స్టఫ్ ఇవ్వడం కోసం తీసిన సినిమా “సన్ ఆఫ్ ఇండియా”. మోహన్ బాబు ఏకపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ఒక ఎక్స్ పెరిమెంటల్ సినిమా కాగా.. దర్శకుడు థియేటర్ల దగ్గర “మీకోసమే లెస్బియన్ కిస్ సీన్స్ పెట్టాం, ఎలా ఉంది?” అని నవ్వుతూ అక్కడి ప్రేక్షకుల్ని అడిగే స్థాయికి దిగజారిన సినిమా ఇది. ప్రయోగాలు చేయడానికి, పైత్యాన్ని ప్రదర్శించుకోవడానికి చాలా చిన్నపాటి తేడా ఉంటుంది. ఆ విషయాన్ని రత్నబాబు ఇకనైనా గుర్తించాలి.

OTT Platform: Amazon Prime

రాధేశ్యామ్

ఒక హీరో ఇమేజ్ కి సరితూగేట్లు సన్నివేశాలు రాసుకోకపోతే ఎలాంటి కథ అయినా బాక్సాఫీస్ దగ్గర వర్కవుటవ్వదు అని నిరూపించిన చిత్రం “రాధేశ్యామ్”. పూజా హెగ్డే & ప్రభాస్ కలుసుకొని ట్రైన్ సీన్ మినహా ఒక్కటంటే ఒక్క మంచి సన్నివేశం కూడా లేని ఈ చిత్రానికి కెమెరా వర్క్ & మ్యూజిక్ మినహా మరో ప్లస్ పాయింట్ లేదు. కెమెరా వర్క్ కు మాత్రం పేరు పెట్టడానికి లేదు. సినిమాలో ప్రభాస్ తో విలన్లపై కూరగాయలు విసిరించడాన్ని మరికొన్ని దశాబ్ధాల వరకూ ప్రభాస్ ఫ్యాన్స్ మరువలేరు, రాధాకృష్ణను తిట్టుకోవడం ఆపలేరు.

OTT Platform: Amazon Prime

ఆచార్య

చిరంజీవి-చరణ్ టెర్రిఫిక్ కాంబినేషన్ లో కొరటాల లాంటి అపజయమెరుగని దర్శకుడు ఒక సినిమా తీస్తున్నాడు అంటే అంచనాలు మామూలుగా ఉండవు. అలాంటిది.. సదరు అంచనాలను తలకిందులు చేయడమే కాక, మెగా ఫ్యాన్స్ అందరూ కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ వెళ్లిపోయే స్థాయి రిజల్ట్ ఇచ్చిన చిత్రం “ఆచార్య”. సినిమా పేరు కంటే సినిమాలో “పాధఘట్టమే” ఎక్కువ ఫేమస్. కాజల్ ఎడిటింగ్ లో కట్ అయిపోయి తప్పించుకుంది. కుదిరితే మెగాస్టార్ ఫిల్మోగ్రఫీలో నుంచి తీసేయాల్సిన సినిమా ఇది.

OTT Platform: Amazon Prime

ఎఫ్ 3

ఎఫ్ 2 హిట్ అయ్యేసరికి.. అదే కాంబినేషన్ లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం “ఎఫ్ 3”. సీక్వెల్ లా కాకుండా కొత్త కథతో అనిల్ తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతల పోస్టర్ల ప్రకారం బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ.. సినిమాలోని లేకి కామెడీ & రోత టేకింగ్ చాలా మంది ప్రేక్షకులకి నచ్చలేదనే చెప్పాలి. ఫన్ & ఫ్రస్ట్రేషన్ అనేది సమపాళ్లలో ఉండాలి కానీ.. “ఎఫ్ 3” ఫన్ కంటే ఎక్కువ ఫ్రశ్ట్రేషన్ ఇచ్చింది.

OTT Platform: Netflix

సమ్మతమే

ఎస్.ఆర్ కళ్యాణ మండపం చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన సినిమాలో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా “సమ్మతమే”. శేఖర్ చంద్ర పాటలు, ట్రైలర్ కూడా ఆడియన్స్ ను ఇంప్రెస్ చేశాయి. కానీ.. సినిమాలో లవ్ & అబ్బాయిల కేరింగ్ ను డీల్ చేసిన విధానం మాత్రం ఎవ్వరికీ ఎక్కలేదు. ఒక అమ్మాయిని ప్రేమించడమంటే.. అనుమానించడమే అన్నట్లుగా ఎలివేట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల ఛీత్కారానికి గురైంది.

OTT Platform: Aha

పక్కా కమర్షియల్

మారుతి బ్రాండ్ సినిమాలకి కాలం చెల్లింది అని గుర్తు చేసిన చిత్రం “పక్కా కమర్షియల్”. గోపీచంద్, రావు రమేష్, సత్యరాజ్ వంటి అద్భుతమైన నటులు, రాశీఖన్నా, సియా గౌతమ్ గ్లామర్ షో ఈ సినిమాను బ్రతికించలేకపోయాయి. ఈ సినిమాతోనైనా కమర్షియల్ గా హిట్ కొడదామనుకున్న గోపీచంద్ కలల మీద నీళ్ళు జల్లిన చిత్రమిది.

OTT Platform: Netflix

హ్యాపీ బర్త్ డే

“మత్తు వదలరా” అనంతరం రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, మీమ్ స్టఫ్ టన్నులు టన్నులుగా ఉన్న సినిమా కావడంతో.. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విశేషమైన బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ బజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. లావణ్య త్రిపాఠి డబుల్ రోల్, ప్రొడక్షన్ డిజైన్ & పూర్ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.

OTT Platform: Netflix

ది వారియర్

మాస్ హీరోగా ప్రూవ్ చేసుకోవడం కోసం పరితపిస్తున్న రామ్ చేసిన మరో తప్పిదం ఈ “ది వారియర్”. తమిళోల్లు మర్చిపోయిన లింగుస్వామికి తెలుగులో అవకాశమిచ్చి, క్రేజీ హీరోయిన్ కృతిని సెట్ చేసుకున్నా కూడా ఈ సినిమాలోని మూస ధోరణి కారణంగా వర్కవుటవ్వలేదు. విలన్ మీద పగ తీర్చుకోవడం కోసం ఒక డాక్టర్ పోలీస్ అయిపోవడం అనేది మూల కథ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్.

OTT Platform: Hotstar

థ్యాంక్ యూ

“లవ్ స్టోరీ”తో బ్లాక్ బస్టర్ కొట్టిన నాగచైతన్య, సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ విక్రమ్ కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం “థ్యాంక్ యూ”. బి.వి.ఎస్.రవి సమకూర్చిన కథే సినిమాకి పెద్ద మైనస్. టేకింగ్ పరంగా కొన్ని చెప్పుకోదగ్గ అంశాలు ఉన్నప్పటికీ.. కథే బాగోకపోవడంతో సినిమాకి ప్రేక్షకులు “నో థ్యాంక్ యూ” చెప్పేశారు.

OTT Platform: Amazon Prime

రామారావు ఆన్ డ్యూటీ

రవితేజ ఈసారి ఖచ్చితంగా హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన చిత్రం “రామారావు ఆన్ డ్యూటీ”. రవితేజ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామి కూడా కావడంతో సినిమాపై మంచి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కట్ చేస్తే.. ఆ వైబ్స్ అన్నిట్నీ తన మేకింగ్ తో తుంగలో తోక్కేశాడు దర్శకుడు శరత్ మండవ. రవితేజ ఫ్యాన్స్ సైతం చివరి వరకూ చూడలేకపోయిన చిత్రమిది.

OTT Platform: Sonyliv

మాచర్ల నియోజకవర్గం

2022లో వచ్చిన అత్యంత రొటీన్ కమర్షియల్ సినిమా అంటే టక్కున గుర్తొచ్చే సినిమా “మాచర్ల నియోజకవర్గం”. సముద్రఖనితో ద్విపాత్రాభినయం చేయించాలనే అద్బుతమైన ఆలోచన మినహా సినిమాలో కొత్తదనం ఇసుమంతైనా లేని చిత్రమిది. నితిన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా మిగిలిపోయిన సినిమా ఇది.

OTT Platform: Zee5

లైగర్

ఈ సినిమా పేరు గుర్తొచ్చినప్పుడల్లా “200 కోట్ల తర్వాతే కలెక్షన్స్ లెక్కపెడతాను” అని విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఇచ్చిన స్టేట్మెంటే గుర్తొస్తుంది. ఒక సినిమా ఎలా తీయకూడదు అని పూరీ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఈ “లైగర్”.

OTT Platform: Hotstar

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

కృతిశెట్టి హీరోయిన్ గా తెరకెక్కి విజయం దక్కించుకోలేకపోయిన మరో చిత్రం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”. సుధీర్ బాబు-మోహనకృష్ణ ఇంద్రగంటిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేయగలిగింది. కానీ.. సినిమా మాత్రం సీరియల్ లా సాగి ప్రేక్షకులకి బోర్ కొట్టించింది.

OTT Platform: Amazon Prime

ది ఘోస్ట్

ఈ ఏడాది “బంగార్రాజు”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగార్జున సోలో హీరోగా మరో ప్రయత్నం “ది ఘోస్ట్”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ ను సినిమా చంపేసింది. పాతకాలం నాటి కథ, పస లేని ఫైట్స్ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

OTT Platform: Netflix

జిన్నా

మంచు విష్ణు హీరోగా కొన్నాళ్ళ విరామం తర్వాత నటించిన చిత్రం “జిన్నా”. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఎవరికీ లేవు కానీ.. సినిమా కలెక్షన్స్ చూసి సీ లెవల్ హీరోలు కూడా నవ్వుకునేలా చేసిన చిత్రమిది. అసలు సన్నీలియోన్ తో ఆ తరహా మానసిక వ్యాధి ఉన్న పేషంట్ రోల్ చేయించాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో అర్ధం కాదు.

OTT Platform: Amazon Prime

ముఖచిత్రం

“కలర్ ఫోటో”తో నేషనల్ అవార్డ్ అందుకున్న సందీప్ రాజ్ కథ-మాటలు-స్క్రీన్ ప్లే అందించిన సినిమా అనేసరికి “ముఖచిత్రం”పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే.. చాలా సెన్సిబుల్ విషయమైన “గృహ హింస”ను ఎలివేట్ చేసిన విధానం, దానికి సమాధానం చెప్పిన తీరు హాస్యాస్పదంగా నిలిచాయి.

OTT Platform: Aha

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus