తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల గురించి నిర్మాతల మధ్య, ప్రేక్షకుల మధ్య జోరుగా చర్చ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలను చూడటానికి థియేటర్లకు క్యూ కట్టిన ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో థియేటర్లలో సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వరుసగా సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నా రిలీజవుతున్న సినిమాలలో చాలా సినిమాలు బ్రేక్ ఈవెన్ కావడం లేదనే సంగతి తెలిసిందే. టాలీవుడ్ పరిస్థితితో పోల్చి చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో 10 సినిమాలు విడుదలైతే ఆ సినిమాలలో ఒక సినిమా మాత్రమే హిట్ రిజల్ట్ ను అందుకుంటూ ఉండటం గమనార్హం. ఎం.ఎస్.రాజు డైరెక్షన్ లో సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన 7 డేస్ 6 నైట్స్ సినిమా శుక్రవారం రోజున థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు పరిమిత సంఖ్యలో థియేటర్లు దక్కాయి. ఈ సినిమా సక్సెస్ మీట్ లో ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ థియేటర్ కు వెళ్లి 7 డేస్ 6 నైట్స్ సినిమా చూశానని అన్నారు.
ప్రేక్షకుల రెస్పాన్స్ ను చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించిందని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆలోచన ప్రకారం పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవాలని చిన్న సినిమాలకు టికెట్ రేట్లు తగ్గించాలని ఆయన అన్నారు. తాను వెళ్లిన ఒక థియేటర్ లో 200 రూపాయలు టికెట్ రేటు పెట్టారని ఆయన అన్నారు. 200 రూపాయలు ఖర్చు చేసి చిన్న సినిమాను ఎవరు చూస్తారని ఎం.ఎస్.రాజు ప్రశ్నించారు.
పెద్ద సినిమాలకు ఎంత రేట్ పెట్టినా క్రేజ్ ఉంటుంది కాబట్టి జనాలు థియేటర్లకు వస్తారని ఆయన తెలిపారు. చిన్న సినిమా కోసం ఏదైనా చేయాలని లేకపోతే చిన్న సినిమా రాదని ఆయన కామెంట్లు చేశారు. చిన్న సినిమాలను తీయాలనుకునే ఔత్సాహిక దర్శకులు ఓటీటీకి వెళ్లాలా? థియేటర్లకు రాలేనా? అని ఎందుకు అనుకోవాలని ఆయన ప్రశ్నించారు.