ఒకప్పుడు సౌత్ సినిమాల్లో టాప్ ఐటెం డ్యాన్సర్‌గా అలరించిన ముమైత్ ఖాన్ (Mumaith Khan), ఇటీవల తన జీవితంలో జరిగిన షాకింగ్ సంఘటనను బయటపెట్టింది. గత కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించకపోవడంతో అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే తాజాగా ఆమె తన హెల్త్ ఇష్యూస్ గురించి వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన ఇంట్లో ఉన్నప్పుడే ఈ ప్రమాదం జరిగిందని ముమైత్ చెప్పింది.
“నాకు డ్యాన్స్ అంటే పిచ్చి. ఓరోజు ఇంట్లో స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, కాలు జారి మంచానికి తల తగిలింది. కానీ, పెద్దగా గాయమేమీ కాకపోయినా, తల మాత్రం బెడ్ మూలకు గట్టిగా తగిలింది. రక్తం రాలేదు కానీ లోపల మాత్రం తీవ్రమైన నరాల సమస్య ఏర్పడింది. వెంటనే మా అమ్మ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ఆ పరిస్థితిని చూసి అసలు నేనెంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నానో అర్థమైంది” అంటూ ఆమె చెప్పిన వివరాలు వైరల్ అయ్యాయి.
అయితే, అసలు షాకింగ్ విషయం ఇంకొకటి. హాస్పిటల్‌లో సర్జరీ అనంతరం ముమైత్ 15 రోజుల పాటు కోమాలో ఉండాల్సి వచ్చింది. “సర్జరీ అయిన తర్వాత ఊహించని పరిణామం జరిగింది. నేను పూర్తిగా అచేతనంగా ఉండిపోయా. మెదడుకు బలమైన ప్రభావం పడడంతో ఆ సమయంలో నాకు ఏం జరిగిందో కూడా తెలియదు. 15 రోజులకు మెలకువ వచ్చినా, అప్పటికే నా మెమరీ డామేజ్ అయింది. ముఖాలు గుర్తుపట్టలేకపోయా. నా ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్లను సైతం గుర్తించలేకపోయాను” అంటూ ఆమె గతం గుర్తు చేసుకుంది.
ఇప్పుడిప్పుడే మెమరీ నెమ్మదిగా రికవర్ అవుతోందని చెప్పిన ముమైత్, మళ్లీ కెరీర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఐటెం సాంగ్స్‌తో పాటు, పవర్‌ఫుల్ క్యారెక్టర్లు చేసిన ముమైత్, ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాలని చూస్తోంది. హైదరాబాద్ లో మేకప్ హెయిర్ అకాడమీ ప్రారంభించిన ఆమె, త్వరలోనే మరికొన్ని సినీ ప్రాజెక్టులకు ఓకే చెప్పే అవకాశం ఉందని సమాచారం.