ఇన్స్టాగ్రామ్ లో 500K ప్లస్ ఫాలోవర్స్ ఉంటే చాలు.. పెయిడ్ ప్రమోషన్స్ అంటూ తెగ హల్ చల్ చేసేస్తుంటారు ఇన్ఫ్లుయెన్సర్లు. అలా కొంతమంది ఇన్స్టా స్టార్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసారు. అందుకోసం భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నారు. చిన్న స్థాయి ఇన్ఫ్లుయెన్సర్స్ మొదలుకొని బడా హీరోయిన్స్ వరకు అందరూ ఈ బెట్టింగ్ యాప్స్ బిజినెస్ లో పాలుపంచుకున్నారు. కొందరు రీల్స్ ద్వారా ఇంకొందరు స్టోరీస్ ద్వారా, మరికొందరు ఏకంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా ఈ యాప్ ను ప్రమోట్ చేయడమే కాక తమ ఫాలోవర్స్ అందరూ ఆ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని డబ్బులు పోగొట్టుకొనేలా చేశారు.
వాళ్లందరిపై సీనియర్ పోలీస్ ఆఫీసర్ సజ్జనార్ (Sajjanar) కన్నెర్ర చేశారు. నిజానికి ఆయన ప్రస్తుతం ఆర్టీసీ డిపార్ట్మెంట్ ను లీడ్ చేస్తున్నప్పటికీ.. ఒక పోలీస్ గా ఆయన బాధ్యతను మాత్రం మరువలేదు. అందుకే.. ఇలా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నవాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపారు. ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ నా అన్వేషణ సహాయంతో ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నవాళ్లందరినీ గుర్తించడం మొదలుపెట్టారు సజ్జనార్ (Sajjanar) & టీమ్. అప్పటి నుండి సెలబ్రిటీలు అందరూ తెగ టెన్షన్ పడిపోతున్నారు.
చాలామంది ఆల్రెడీ “బెట్టింగ్ యాప్స్ కు దూరంగా ఉండండి” అంటూ వీడియోలు రిలీజ్ చేయడం కూడా మొదలుపెట్టారు. మరి ఇలాంటి వీడియోలు పెట్టినందుకు సజ్జనార్ ఏమైనా కరుణిస్తారా లేక నిన్న 11 మంది మీద కేసులు వేసినట్లు టాలీవుడ్ సెలబ్రిటీల పాత బెట్టింగ్ యాప్ ప్రమోషనల్ వీడియోస్ అన్నీ తవ్వి తీసి అందరినీ ఇబ్బందుల్లో పెడతారా అనేది చూడాలి. ఇకపోతే.. సజ్జనార్ (Sajjanar) కేవలం సినిమా వాళ్ల మీదే కాక లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తున్నారట.