‘అతడు’ సినిమాలో మహేష్ బాబు నందు అనే పాత్ర పోషించారు. తర్వాత బాసర్లపూడికి కథ షిఫ్ట్ అయినప్పుడు మహేష్ బాబు పార్ధు అనే పాత్రలో కనిపిస్తారు. అయితే నందు పాత్రలో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. దీంతో మురళీమోహన్ అభ్యంతరం తెలిపారట. ఆగస్టు 9న ‘అతడు'(4K) లో రీ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ.. “త్రివిక్రమ్ గారు మొదటి సినిమాగా ‘అతడు’ చేయాలి. కానీ అప్పటికే ఆయన స్రవంతి రవికిశోర్ గారికి ఫస్ట్ సినిమా చేస్తానని మాట ఇచ్చారు. అదే మాట మాకు చెప్పారు. ‘కచ్చితంగా రెండో సినిమా మీకే చేస్తాను’ అని చెప్పారు. అందుకు మేము కూడా ఓకే అని కథ చెప్పడానికి రమ్మని చెప్పాము. ఆయన ఒక రోజు వచ్చి ‘అతడు’ కథ చెప్పారు. కథ వినే ముందు ఫోన్లు అవి సైలెంట్ గా పెట్టేసి కాన్సంట్రేట్ చేసి వినండి అని చెప్పారు.
దాదాపు 3 గంటల పాటు ఆయన ‘అతడు’ కథ చెప్పారు. అయితే నాకు హీరో క్యారెక్టర్ స్టార్టింగ్ పోర్షన్లో నెగిటివ్ గా అనిపించింది. అప్పట్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు అన్నట్లు ఉండేది. అందుకో త్రివిక్రమ్ ని నేరుగా అడిగేశాను. అందుకు ఆయన.. ఇప్పటి ట్రెండ్ ఇదేనండీ. ‘మీరు హాలీవుడ్ సినిమాలు ఏవైనా చూడండి.. హీరో రోల్ అలాగే ఉంటుంది’ అని అన్నారు. మా బ్రదర్ కూడా అలాగే అనడంతో ఓకే చెప్పి ముందుకు వెళ్లాం” అంటూ చెప్పుకొచ్చారు.