సంగీత దర్శకుడు ఇళయరాజాకి చెన్నైలో ప్రసాద్ స్టూడియో యాజమాన్యానికి మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రసాద్ స్టూడియోలో ఓ గదిని ఆఫీస్ గా చేసుకొని.. అక్కడ నుండే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇళయరాజా. దాదాపు నలభై ఏళ్ల నుండి ఆయన ఈ పని చేస్తున్నారు. అయితే ఇటీవల ప్రసాద్ స్టూడియో యాజమాన్యం ఇళాయరాజాతో ఆ గది ఖాళీ చేయించింది. దీంతో ఆగ్రహించిన ఇళయరాజా ఆ గదిపై తనకు హక్కులు ఉన్నాయంటూ హైకోర్టుని సంప్రదించారు.
ధ్యానం చేసుకోవడానికి గదిలోకి వెళ్తే.. తనను ఉండనివ్వడం లేదని.. నలభై ఏళ్లుగా ఉంటున్న గది నుండి తనను బలవంతంగా బయటకి గెంటేశారని.. తన సంగీత పరికరాలు కూడా నాశనం చేశారంటూ కోర్టుకి తెలిపారు ఇళయరాజా. హైకోర్టు కూడా ఇళయరాజాకి ఫేవర్ గా మాట్లాడింది. ఒకరోజు ధ్యానం చేసుకోవడానికి ఇళయరాజాకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై సోమవారం నాడు ప్రసాద్ స్టూడియో అధినేతలు కోర్టులో తమ వాదనలు వినిపించారు.
ఇళయరాజా గది అడుగుతోంది.. ధ్యానం కోసం కాదని.. దానిని ఆయన సొంత ఆస్తిగా ఎందుకు భావిస్తున్నారని ప్రసాద్ స్టూడియో ప్రశ్నిస్తుంది. నిజానికి ఇళాయరాజాకి చెన్నైలో చాలా ఆఫీసులు ఉన్నాయి. అందులో మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తుంటారు. కానీ ప్రసాద్ స్టూడియోలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేయడం ఆయనకొక సెంటిమెంట్. అయితే ఇన్నేళ్లుగా ఆయన గదికి అద్దె చెల్లించలేదు. ఇప్పుడు ఖాళీ చేయమని అడిగినప్పుడు కనీసం అద్దె కడతానని కూడా ఆయన అనలేదని ప్రసాద్ స్టూడియో అధినేతల వాదన. ఈ ఒక్క గది కోసం ఇళయరాజా పట్టుపట్టడం.. కోర్టుకి వెళ్లడం ఏంటనేది ఎవరికీ అర్ధం కావడం లేదు.