థియేటర్లో నుంచి బయటకొచ్చినా.. సినిమాలో నుంచి బయటకి రాకూడదు

  • July 8, 2020 / 12:04 PM IST

“సావిత్రిగారి గురించి ఎవరికీ తెలియని విషయాలేమీ లేవు. ఆ విషయాలనే మళ్ళీ జనాలకి కొత్తగా కాకపోయినా ఆసక్తికరంగా చూపించాలి, రెండున్నర గంటల సినిమా చూసిన ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటకి వచ్చేప్పుడు “మహానటి” అనుభూతులు వాళ్ళ మదిలో మెదులుతూ ఉండాలి. ఒక ఫిలిమ్ మేకర్ గా నాకు అంతకుమించిన కోరిక లేదు” అంటూ “మహానటి” సినిమా ద్వారా ఒక దర్శకుడిగా తాను ఏం సాధించాలనుకొంటున్నాడు, అసలు “మహానటి” మేకింగ్ వెనుక కష్టం ఏమిటి అనే విషయాలు ఈ బుధవారం సినిమా విడుదలను పురస్కరించుకొని పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం..!!

ఆ ఆరు గంటల రేడియో షో విన్న తర్వాత..

సావిత్రిగారి గురించి చిన్నప్పట్నుంచి తెలిసినా.. ఆమె గురించి చదివిన పుస్తకాలు, పేపర్ కటింగ్స్ వల్ల ఆమె సినిమాల గురించి, పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలు మాత్రమే తెలుసు. కానీ.. కిరణ్ ప్రభుగారు దాదాపు 6 గంటల సేపు సావిత్రి గారి గురించి చేసిన రేడియో షో విన్న తర్వాత మాత్రం సావిత్రిగారి మీద, ఆవిడ జీవితం మీద విపరీతమైన గౌరవం పెరిగింది. అప్పట్నుంచి ఆమె గురించి తెలుసుకుంటూ వచ్చాను. అలా ఆమె గురించి సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది.

రియల్ లైఫ్-రీల్ లైఫ్ మిక్స్..

సావిత్రిగారి సినిమా అంటే కొన్ని సినిమాలు కాదు, కొన్ని సంఘటనలు కాదు.. ఒక జీవితం. ప్రేక్షకులకు ఆమె గురించి తెలియని ఎన్నో విశేషాలను, సంఘటనలను తెలియజేయాలనుకొన్నాను. ఒక పరిపూర్ణమైన చిత్రంగా “మహానటి”ని తీర్చిదిద్దడం కోసం చాలా కష్టపడ్డాను. సావిత్రిగారు మొదటిసారి ఏఎన్అర్ గారిని “బాలరాజు” షూటింగ్ సమయంలో కలుసుకోవడం మొదలుకొని.. నటిగా ఆమె ఎదుగుదల, వైవాహిక జీవితం, ఆస్తిపాసుల సంపాదన, ఆమె మరణం.. ఇలా సావిత్రి జీవితానికి సంబంధించిన అన్నీ అంశాలనూ కవర్ చేశాను.

నా పని కాస్త సులువైంది..

నేను సావిత్రి గారి అన్నీ సినిమాలూ చూడలేదు, కుదరదు కూడా. అయితే.. కొందరు సీనియర్ రచయితలు, పాత్రికేయులు ఆమె జీవితం గురించి రాసిన పుస్తకాలు బాగా హెల్ప్ అయ్యాయి. నేను ఎక్కువ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండాపోయింది. ఇక సావిత్రి గారి పిల్లలు ఇంకాస్త ఇన్ఫో ఇచ్చారు. సో, ఒక డైరెక్టర్ గా “మహానటి” కథ సిద్ధం చేసుకోవడానికి పెద్దగా ఇబ్బందిపడలేదు.

తర్వాత మళ్ళీ తీయలేనేమో అనిపించింది..

“ఎవడే సుబ్రమణ్యం” తర్వాత అసలు మళ్ళీ ఏ సినిమా తీయాలి అనే క్లారిటీ లేకుండాపోయింది. ఇక “మహానటి” సినిమా తీయాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉంది. “రెండో సినిమాతోనే ఇంత రిస్క్ ఎందుకు” అని ప్రశ్నించినవాళ్లూ ఉన్నారు. కానీ.. నావరకు ఒక దర్శకుడిగా నేను ఇంకా తొలి అడుగుల్లోనే ఉన్నాను. కాబట్టే ఒక ఫిలిమ్ మేకర్ గా హానెస్ట్ గా “మహానటి” చిత్రాన్ని తీయగలను అనిపించింది. అందుకే రెండో సినిమాకే ఇలా సాహసం చేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకో భయం ఏమిటంటే.. ఒక పెద్ద హిట్, లేదా పెద్ద ఫ్లాప్ తర్వాత ఈ సినిమా తీయలేనేమో అన్న భయం.

ఫ్లో మాత్రం మిస్ అవ్వదు..

నిజానికి సావిత్రిగారి గురించి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫోతో అమెజాన్ సిరీస్ ఒకటి ప్లాన్ చేయొచ్చు. కానీ.. ఎక్కువ సన్నివేశాలతో, ఎక్కువ పాత్రలతో ఉండడం వలన లెంగ్త్ ఎక్కువైంది అనిపించింది కానీ.. ఎక్కడా ఫ్లో మిస్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించానని నమ్ముతున్నాను. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ డిసైడ్ చేయాలి.

కీర్తి విషయంలో రిస్క్ తీసుకున్నాను..

తమిళంలో “తొడరీ” (తెలుగులో “రైల్”) సినిమా చూసినప్పుడు సావిత్రిగారి యంగ్ ఏజ్ కి ఈ అమ్మాయి సరిగ్గా సూట్ అవుతుంది అనిపించింది. అలాగే.. ఆమె విషయంలో భయం కూడా ఉండింది ఏమిటంటే.. అప్పటివరకూ ఆ అమ్మాయి చేసినవన్నీ కమర్షియల్ హీరోయిన్ రోల్సే. సో, ఒక నటిగా ఆమె ప్రూవ్ చేసుకొన్నదేమీ లేదు. అయితే.. నా మనసు చెబుతున్నదేమిటంటే.. “ఈ అమ్మాయి న్యాయం చేయగలదు”అని. సో, గుడ్డిగా నా మనసు మాట విని కీర్తి సురేష్ తో రిస్క్ చేశాను. లక్కీగా కీర్తి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుతంగా నటించింది. ఈ సినిమా చూసిన తర్వాత కీర్తి మీద మన దృష్టికోణం పూర్తిగా మారిపోతుంది.

వాళ్ళందరూ సావిత్రి గారి కోసం చేశారు..

ఈ సినిమాలో మోహన్ బాబు గారు, నాగచైతన్య క్రిష్, తరుణ్ భాస్కర్, విజయ్ దేవరకొండ వంటివాళ్ళందరూ నన్ను చూసో లేక వైజయంతీ మూవీస్ బ్యానర్ కోసమే ఈ సినిమాలో నటించలేదు. కేవలం సావిత్రిగారి మీద ఉన్న అభిమానం, ప్రేమతోనే ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటించారు తప్పితే, ఇంకో కారణమేమీ లేదు.

ట్రైలర్ అవసరం లేదనిపించింది..

సింపుల్ గా టీజర్ రిలీజ్ చేసి ఇంక వేరే ప్రోమోస్ కానీ ట్రైలర్ గానీ లేకుండా సినిమా రిలీజ్ చేయడం వెనుక ప్రత్యేకించి కారణం ఏమీ లేదు. ఎందుకంటే.. టీజర్ తోనే సినిమా కంటెంట్ ఏమిటి అనేది తెలియజెప్పాను. అందువల్ల మళ్ళీ ప్రత్యేకించి ట్రైలర్ రిలీజ్ చేయాలి అన్న ఆలోచన రాలేదు.

వైజయంతీ వారి సపోర్ట్ లేకపోతే “మహానటి”ని ఊహించలేను..

కేవలం “వైజయంతీ మూవీస్’ బ్యానర్ లో నా భార్య ప్రియాంక సపోర్ట్ ఉంది కాబట్టే “మహానటి”ని ఇంత గ్రాండ్ స్కేల్ లో తీయగలిగాను తప్పితే.. వేరే ఏదైనా నిర్మాణ సంస్థలో అయితే ఈ స్థాయిలో తెరకెక్కించగలిగేవాడిని కాదేమో. స్వప్న దత్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను.

ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్..

“మహానటి” సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన పీరియాడిక్ ఎక్స్ పీరియన్స్ తప్ప ఏమీ ఆఫర్ చేయలేను. సావిత్రి గారి గురించి పలు విధాలుగా అందరికీ తెలిసిందే. అయితే.. ఆ విశేషాలన్నీ ఒకే తెరపై చూడాలంటే “మహానటి” చూడాల్సిందే.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus