ఒక సినిమా వదులుకుంటే వీలవలేదు అనుకుంటారు.. రెండు సినిమాలు వదులుకుంటే ఏమో అంతగా కుదర్లేదు అనుకోవచ్చు. కానీ ఏకంగా ఐదు సినిమాల కథలు విని వదులుకుంటే ఏమనాలి? ఈ ప్రశ్నకు టాలీవుడ్‌లో కచ్చితంగా ఆన్సర్ చెప్పగలిగేది ఇద్దరే. ఒకరు యువ స్టార్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) అయితే, రెండోది యువ దర్శకుడు వెంకీ అట్లూరి. ఎందుకంటే ఈ ఇద్దరి మధ్యే జరిగింది ఇదంతా. వెంకీ అట్లూరి ఇప్పటివరకు చేసిన సినిమాల కథలన్నీ నాగచైతన్యకు వినిపించారట. కానీ సినిమాలు పట్టాలెక్కలేదట. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు.
వెంకీ అట్లూరి తన తొలి సినిమా ‘తొలిప్రేమ’ను వరుణ్‌తేజ్‌తో చేశాడు. ఆ తర్వాత రెండో సినిమా ‘మిస్టర్ మజ్ను’ అఖిల్‌తో తెరకెక్కించాడు. మూడో సినిమా ‘రంగే దే’లో హీరో నితిన్. తొలి సినిమా మంచి విజయం అందుకోగా.. రెండు, మూడు సినిమాలు ఊహించని ఫలితాలు తీసుకొచ్చాయి. ఆ తర్వాత నాలుగో సినిమాగా ధనుష్‌తో ‘సార్’ తెరకెక్కించాడు. ఐదో సినిమా విషయానికొస్తే దుల్కర్ సల్మాన్‌తో చేసిన ‘లక్కీ భాస్కర్’. ఈ రెండూ మంచి విజయాలే అందుకున్నాయి.
ఈ అన్ని కథల్ని వెంకీ అట్లూరి.. నాగచైతన్యకు చెప్పారట. అక్కినేని ఫ్యామిలీ అంటే వెంకీకి అంత అభిమానం. నాగార్జున, చైతు, అఖిల్‌ను డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుండో టార్గెట్‌గా పెట్టుకున్నాడు. అఖిల్‌తో సినిమా చేస్తే అది ఇబ్బంది పెట్టింది. కానీ చైతు, నాగ్‌తో సినిమా అయితే చేసే ఆలోచనలో ఉన్నాడు. ముందు చైతన్యతో సినిమా చేద్దామని తనకున్న పరిచయంతో కథలు చెప్పాడు. కానీ డేట్స్, పరిస్థితులు లాంటి కారణాల వల్ల ఆ సినిమాలు మెటీరియలైజ్ అవ్వలేదు.
అలా ‘సార్’, ‘లక్కీ భాస్కర్’, ‘తొలిప్రేమ’ను మిస్ అయ్యాడు చైతు. ప్రస్తుతం చైతు – కార్తిక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ట్రెజర్ హంట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ‘వృష ఖర్మ’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఇటీవల సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా తర్వాత ఏమన్నా వెంకీ అట్లూరి కథ చెబుతారేమో చూడాలి.