‘వీరసింహుని విజయోత్సవం’ వేడుకలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, డిస్కషన్ ఆఫ్ ది సోషల్ మీడియా అనే విషయంలో తెలిసిందే. ఆయన అంతగా ఏమన్నారు? ఏదో నోరుజారారు అని నందమూరి ఫ్యాన్ష్, టీడీపీ కార్యకర్తలు అంటుంటే.. అలాంటి మాటే వేరెవరైనా వాళ్ల మనిషిని అంటే ఊరుకుంటారా? అనేది రెండో వర్గం మాట. ఓవైపు అఖిల్, నాగచైతన్య ఈ విషయంలో జెంటిల్ ఖండనతో ట్వీట్లు చేశారు. తాజాగా ఎస్వీ రంగారావు వారసులు కూడా స్పందించారు.
దీనిని పట్టుకుని ఏం జరగలేదు, రంగారావు వారసులు చెబుతున్నారు కదా అంటూ బాలకృష్ణ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఆ రోజు అంటే అక్కినేని వర్ధంతి రోజు జరిగిన ‘వీర సింహుని విజయోత్సవం’లో బాలకృష్ణ ఇబ్బందికరంగా మాట్లాడింది అక్కినేని గురించే అనేది ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. ఎందుకంటే బాలయ్య మాట్లాడుతూ ‘ఆ రంగారావు ఈ రంగారావు’ అని అన్నారు. కానీ ‘అక్కినేని తొక్కినేని’ అని అన్నారు. ఇందులో ఎవరిని తక్కువ చేసి మాట్లాడారు అనేది తెలుస్తోంది.
ఇలాంటి సమయంలో ఎస్వీఆర్ను అవమానించిన బాలయ్య క్షమాపణలు చెప్పాలంటూ కాపునాడు పేరుతో కొందరు ప్రకటన విడుదల చేయడం తెలిసిందే. ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు చిన్న ఎస్వీఆర్, ఎస్. వి. ఎల్. ఎస్. రంగారావు (బాబాజీ) మాత్రం బాలయ్య వ్యాఖ్యల్లో తప్పుబట్టడానికి ఏమీ లేదని తేల్చేశారు. దీంతో ఈ విషయంలో ఎస్వీఆర్ వరకే తేలింది. అక్కినేని విషయం ఇంకా తేలలేదు. దీనిపై ఎప్పటికైనా ఓ స్పందన రావాల్సిందే అంటున్నారు అక్కినేని ఫ్యాన్స్.
ఇక ఎస్వీఆర్ మనవళ్లు ఏమన్నారో చూస్తే.. “వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో నందమూరి బాలకృష్ణ మాట్లాడిన కొన్ని విషయాల మీద మీడియా, సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. మాకు, బాలకృష్ణకు మంచి అనుబంధం ఉంది. ఆయన మాట్లాడినది తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి మాత్రమే. ఈ విషయంలో మాకు, మా కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించడం లేదు’’ అని తెలిపారు. ఈ లెక్కన విషయం రంగారావు వరకే తేలింది అని చెప్పొచ్చు.