“అలా మొదలయింది..” ఈ చిత్రం నాని, నిత్యామీనన్ సినీ కెరీర్ ని మలుపుతిప్పింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వారిద్దరి మధ్య స్నేహం ఇప్పటికి చెక్కుచదరకుండా ఉంది. నాని నిర్మాతగా మారి నిర్మించిన తొలి సినిమా “అ!” లోను నిత్యామీనన్ కీలకరోల్ చేశారు. ఈ ప్రయోగాత్మక చిత్రంలో నాని కూడా చేపగా కనిపించారు. ఇప్పుడు నిత్యామీనన్ ప్రధాన పాత్రలో “ప్రాణ” అనే మూవీ తెరకెక్కుతోంది. ప్రధాన పాత్ర అనడం కంటే ఒకే ఒక్క పాత్రతో రూపుదిద్దుకుంటోందని చెప్పవచ్చు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ను నాని విడుదల చేశారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడదల చేయనున్నారు.
ఈ ప్రయోగాత్మక సినిమాకి ప్రముఖ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. వీకే ప్రకాశ్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ గా పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పుకుట్టీ సౌండ్ డిజైన్ చేస్తున్నారు. లూయిజ్ బ్యాంక్స్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఎస్ రాజ్ ప్రొడక్షన్స్, రియల్ స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తాను కూడా భాగస్వామిని అని నాని చెప్పారు. అది చిన్న పార్ట్ మాత్రమే అని వెల్లడించారు. సినిమాలో కనిపిస్తారా? లేకుంటే వినిపిస్తారా? పోనీ నిర్మాణంలో భాగస్యాములు అవుతారా? అనేది .. నాని స్పష్టం చేయలేదు.