క్లాస్ మూవీస్, రామ్ కామ్ సినిమాలు తీసుకుంటూ ఇన్నాళ్లూ కెరీర్‌ను విజయవంతంగా నడిపిస్తూ వచ్చారు నాని. మధ్యలో మాస్ యాంగిల్ వైపు కాస్త వెళ్లినా ఆ సినిమా ఫలితాలు కాస్త ఇబ్బంది పెట్టాయి. దీంతో ఎందుకు ఇబ్బంది అనుకున్నారో ఏమో తిరిగి నార్మల్ మూవీస్‌కి వచ్చారు. కాస్త కెరీర్ స్టెబిలేజ్ అయ్యాక ఇప్పుడు మాస్ నాని అనిపించుకునే పనిలో పడ్డారు. వాటికి చిన్న కాన్సెప్ట్ యాడ్ చేసి తన మ్యాజిక్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ టచ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘సరిపోదా శనివారం’, ‘హిట్ 3’, ‘దసరా’ అంటూ మాస్ నాని బయటికొచ్చాక.. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ అంటూ పూర్తి డిఫరెంట్ మాస్ లుక్‌తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు ప్రచారం, హైప్ విషయంలో నాని కొత్త ఆలోచనలు చేస్తున్నాడట. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కనెక్ట్ మోబ్‌సీన్ అనే హాలీవుడ్ ఏజెన్సీతో చర్చలు జరుపుతున్నారట . ‘అవతార్’ లాంటి ఎన్నో సినిమాలకి మార్కెటింగ్, ప్రచార వ్యూహాల్ని ఈ సంస్థ అందించిన విషయం తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తామని టీమ్ ఇప్పటికే చెప్పింది. ఆ నేపథ్యంలో ఈ సినిమా కోసం ప్రఖ్యాత హాలీవుడ్ నటుడిని ఎంపిక చేసే ఆలోచనలో కూడా ఉన్నారట. గ్లోబల్ సినిమాకి తగ్గట్టుగానే సినిమా ప్రచార కార్యక్రమాల్ని చేపడతారట. అందుకే కనెక్ట్ మోబ్‌సీన్‌ను కాంటాక్ట్ అయ్యారు అని తెలుస్తోంది. సినిమాలో నాని పేరు, ఇటీవల వచ్చిన గ్లింప్స్ సినిమా మీద హైప్‌ను పెంచాయి. ఇప్పుడు హాలీవుడ్ టచ్ దానిని రెండింతలు చేసింది.
‘దసరా’ తర్వాత నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ కాంబినేషన్ మ్యాజిక్ తిరిగి ఈ సినిమాతో చూడొచ్చు అని సినిమా టీమ్ బలంగా చెబుతోంది. ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ చేస్తామని టీమ్ తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.