నేచురల్ స్టార్ నాని (Nani) లేటెస్ట్ మూవీ ‘హిట్ 3’ (HIT 3) ఈరోజు అనగా మే 1న రిలీజ్ అయ్యింది. శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు 15 రోజుల ముందు నుండి నాని ఈ సినిమాని తెగ ప్రమోట్ చేశాడు. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ప్రమోట్ చేసి వచ్చాడు.
తొలి రోజు ఈ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వాళ్లంతా ‘నాని మళ్ళీ ఒక హిట్టు కొట్టాడు’ అని అంటున్నారు. వీకెండ్ కు కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జనాలు థియేటర్లకు రావడం లేదని డిస్ట్రిబ్యూటర్స్ గోల పెడుతూ.. కరెంట్ ఖర్చులు సేవ్ చేయడానికి క్లోజ్ చేసుకుని కూర్చుంటున్నారు.
ఇలాంటి టైంలో ‘హిట్ 3’ కి పాజిటివ్ టాక్ రావడం.. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరగడం వంటివి సంతోషించదగ్గ విషయాలే. కాకపోతే బయ్యర్స్ ను ఒక విషయం కలవరపెడుతుంది. అదేంటంటే… ‘హిట్ 3’ ప్రమోషన్స్ లో నాని ‘మాది భీభత్సమైన వయొలెంట్ సినిమా. నన్ను ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్, మృదు స్వభావం కలిగిన వాళ్ళు, చిన్న పిల్లలు మే 1న హిట్టుకి రాకండి’ అని కచ్చితంగా చెప్పేశాడు.
అంతేకాదు ‘నా కొడుకు అర్జున్ ను కూడా ‘హిట్ 3′ కి తీసుకెళ్ళను’ అని చెప్పడం కూడా జరిగింది. నాని సినిమాలకి ఎక్కువగా థియేటర్లకు వచ్చేదే ఫ్యామిలీ ఆడియన్స్. వాళ్ళనే రావద్దు అంటే… ఎలా..! వీకెండ్ వరకు ఎలాంటి సినిమాకి అయినా జనాలు థియేటర్ కు వస్తారు. కానీ వీక్ డేస్ లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కు రాకపోతే ‘హిట్ 3’ థియేట్రికల్ బిజినెస్ రికవరీ అవ్వడం కష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్స్ లో కలవరం మొదలైనట్టు టాక్.