సినీ, రాజకీయ నేపథ్యం నుండి ఒకరు హీరోగా పరిచయమవుతున్నారంటే ఎలాంటి సినిమాలు ఎంచుకుంటారో అందరికీ తెలిసిందే. మాస్ హీరోగా నిలదొక్కుకోవాలనుకునే వారైతే కమర్షియల్ సినిమాలు, అది కాదన్నవారు ప్రేమకథలు. ఇదీ డెబ్యూట్ హీరోలు నడిచే దారి. అయితే దీనికి భిన్నంగా ఓ కొత్తబాటని ఏర్పరుచుకున్నాడు నారా రోహిత్. ‘బాణం’ వంటి విభిన్నమైన కథతో ఎంట్రీ ఇచ్చి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ కెరీర్ నడిపిస్తున్న రోహిత్ గేరు మార్చి కమర్షియల్ బాట పట్టనున్నాడట.
తొలి సినిమా మొదలు ‘ప్రతినిధి’, ‘రౌడీఫెలో’, ‘అసుర’ వంటి కథాబలం ఉన్న సినిమాలు చేసి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రోహిత్. ‘బాణం’, ‘సోలో’ మినహా మిగతా అన్ని సినిమాల్లోను అతగాడు ఎదుర్కుంటున్న ఒకే ఒక్క విమర్శ ‘అధిక బరువు’. సన్నివేశాలకు అనుగుణంగా సహజ భావోద్వేగాలు పండించే రోహిత్ ఈ విషయంలో మాత్రం ఏళ్ళుగా విమర్శలపాలవుతూనే ఉన్నాడు. అయితే ఇటీవల కాస్త సన్నబడిన రోహిత్ ఈ మార్పుకు కారణమేమిటని అడుగగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎంచుకున్న కథల వల్ల ‘బరువు’ పెద్ద సమస్య కాలేదన్న రోహిత్ ఇప్పుడు కమర్షియల్ కొలతల కోసం తన కొలతలను మార్చుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే రోహిత్ చేసే ఈ ”కొలతల” సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారన్నది ప్రస్తుత ప్రశ్న.