సంక్రాంతి రేసులో నిలిచిన 5 సినిమాల్లో.. ఎవ్వరికీ ఎలాంటి అంచనాలు లేని సినిమా “నారీ నారీ నడుమ మురారి”. శర్వానంద్ హీరోగా “సామజవరగమన” ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది. ఆండర్ డాగ్ లాంటి ఈ చిత్రం గెలుపు గుర్రమెక్కిందా? అనేది చూద్దాం..!!

కథ: ప్రేమించిన అమ్మాయి నిత్య (సాక్షి వైద్య)ను పెళ్లి చేసుకోవడానికి వాళ్ల నాన్నని ఎంతో కష్టపడి ఒప్పించి, సర్వం సిద్ధం చేసుకున్న పొట్లకాయల గౌతమ్ (శర్వానంద్)కి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ఫిట్టింగ్ పెడతాడు మామయ్య రామలింగయ్య (సంపత్). అందుకు కారణం గౌతమ్ తండ్రి కార్తీక్ (నరేష్) 59 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకోవడమే.
రిజిస్టర్ మ్యారేజ్ కి కూడా రెడీ అయిన గౌతమ్ కి.. రిజిస్టర్ ఆఫీస్ లో పెద్ద షాక్ తగులుతుంది. ఏమిటా షాక్? ఆ సమస్య నుండి గౌతమ్ ఎలా బయటపడ్డాడు? అనేది “నారీ నారీ నడుమ మురారి” కథాంశం.

నటీనటుల పనితీరు: నరేష్ ఈ సినిమాలో తనదైన కామెడీ టైమింగ్ & పర్సనాలిటీతో అందర్నీ డామినేట్ చేసేసాడు. అసలు ఆ వరుస పంచులు కానీ, క్యారెక్టర్ ద్వారా క్రియేట్ అయ్యే సందర్భాలు కానీ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి.
శర్వానంద్ “రన్ రాజా రన్” తర్వాత మళ్లీ ఈ సినిమాలోనే ఫ్రెష్ & ఎనర్జిటిక్ గా కనిపించాడు. శర్వా ఎక్స్ ప్రెషన్స్ తో మంచి ఫన్ జనరేట్ చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ఆకట్టుకున్నాడు.
“ఏజెంట్, గాంఢీవథారి అర్జున” సినిమాల రిజల్ట్స్ కారణంగా హీరోయిన్ సాక్షి పెద్దగా ఎలివేట్ అవ్వలేదు కానీ.. ఈ సినిమాలో నిత్య పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం, కామెడీ సీన్స్ కు రెస్పాండ్ అయిన తీరు అభినందనీయం. సరైన ప్రాజెక్ట్స్ సెలక్ట్ చేసుకోగలిగితే మంచి భవిష్యత్ ఉంటుంది ఆమెకు.
సంయుక్త మీనన్ పాత్రకి సన్నివేశాలు లిమిటెడ్ గా ఉన్నప్పటికీ.. ఆమె ఆకట్టుకోగలిగింది.
సుదర్శన్ పంచులు, వెన్నెల కిషోర్ టైమింగ్ హిలేరియస్ గా వర్కవుట్ అయ్యాయి. సంపత్ రాజ్-గెటప్ శ్రీనులా కామెడీ బాగా పేలింది. సిరి హనుమంతుకి డైలాగులు లేకపోయినప్పటికీ.. ఆమె ఈ పాత్ర యాక్సెప్ట్ చేయడం అనేది కొంచం రిస్కే. సినిమాలో ఆమె పోషించిన పాత్ర ఆమెకు మంచి రెస్పెక్ట్ తీసుకురావడం ఖాయం.
ఇక మధ్య మధ్యలో వచ్చి వెళ్లిపోయే సత్య కామెడీ సీక్వెన్సులు, పంచులు కూడా భలే పేలాయి. సినిమా కాస్త బోర్ అవుతుంది అనే ఫీల్ వచ్చినప్పుడల్లా సత్యని ప్రాపర్ గా వాడుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: రామ్ అబ్బరాజు-భాను భోగవరపు – నందు సవిరిగాన త్రయం యొక్క రైటింగ్ ను ముఖ్యంగా మెచ్చుకోవాలి. పాయింట్ కొత్తగా ఉండడమే కాదు.. ఆ పాయిట్ ను నడిపిన విధానం కూడా కొత్తగా ఉంది. అలాగే.. నరేష్ పాత్రను చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రాయడం, తీయడం అనేది మామూలు విషయం కాదు. సీన్ కంపోజిషన్ & స్క్రీన్ ప్లే విషయంలో రామ్ అబ్బరాజును అభినందించాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ సినిమా మొదలుకొని, డ్యూడ్ పెళ్లి సీన్ లాంటివి ఈ సినిమాలో ఇంత త్వరగా స్పూఫ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. తెలుగు ఇండస్ట్రీలో రైటర్స్ లేని లోటు ఈ త్రయం కొంతవరకు తీరుస్తుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ ఇంకా రేసీగా ఉండడం, ఎక్కడా బోర్ కొట్టకుండా సత్య పాత్రను వాడుకోవడం, ఎమోషన్స్ ను కూడా చక్కగా ఎలివేట్ చేసుకుంటూ వెళ్లడం అనేది సినిమాకి ప్లస్ పాయింట్. ఓవరాల్ గా.. దర్శకుడిగా రామ్ అబ్బరాజు రెండో సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడనే చెప్పాలి.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ లో కొన్ని తప్పులు ఉన్నా.. అవన్నీ కామెడీ కవర్ చేసేసింది.
ఇక సినిమాకి మైనస్ అనిపించింది విశాల్ చంద్రశేఖర్ పాటలు మాత్రమే. ఒక్క పాట కూడా గుర్తుంచుకొనే స్థాయిలో లేదు. నేపథ్య సంగీతం మాత్రం కామెడీ పంచులను బాగా ఎలివేట్ చేసింది. రవిశంకర్ ఎడిటింగ్ స్టైల్ కూడా బాగుంది. సినిమాలో ప్రెజెంట్ & పాస్ట్ ను కన్ఫ్యూజన్ లేకుండా ఎడిట్ చేసిన విధానం బాగుంది. అందుకు శర్వా స్టయిలింగ్ టీమ్ ను కూడా మెచ్చుకోవాలి. వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపించారు.

విశ్లేషణ: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తే ప్రేక్షకులు ఆ కామెడీ ఆస్వాదించే రేంజ్ వేరేలా ఉంటుంది. “నారీ నారీ నడుమ మురారి” విషయంలో జరిగింది అదే. రామ్ అబ్బరాజు రైటింగ్ & డైరెక్షన్, నరేష్ పాత్ర, శర్వానంద్ ఎనర్జీ హైలైట్ గా నిలిచిన ఈ చిత్రం సంక్రాంతి రేసులో “మన శంకర వరప్రసాద్ గారు” తర్వాత సెకండ్ చాయిస్ ఫర్ ఆడియన్స్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు అండర్ ప్లే చేసిన అనిల్ సుంకర, ఇప్పుడు తన మార్కెటింగ్ స్ట్రాటజీతో ఈ సినిమాని ఇంకాస్త బాగా ప్రమోట్ చేస్తే.. సంక్రాంతి విన్నర్ గా నిలిచే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్న సినిమాగా నిలవడం ఖాయం.

ఫోకస్ పాయింట్: సర్ప్రైజింగ్ & హిలేరియస్ ఎంటర్టైనర్!
రేటింగ్: 3/5
