హీరోహీరోయిన్లు ఎవరు, సినిమా జోనర్ ఏంటి? అనే విషయం పట్టించుకోకుండా “ఎ మణిరత్నం ఫిలిమ్” అనే ట్యాగ్ చూసి థియేటర్లకు పరిగెట్టే స్థాయి అభిమానులను సంపాదించుకొన్న ఏకైక దర్శకుడు మణిరత్నం. ఆయన సినిమాలు ఫ్లాపైనా ఆయన్ని పన్నెత్తి మాట అనరు ఎవరూ. ఎందుకంటే ఆయన సినిమాలు ఫ్లాపై ఉండొచ్చు ఆయన మాత్రం ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. అటువంటి మహా దర్శకుడి నుంచి వచ్చిన తాజా చిత్రం “నవాబ్”. తమిళంలో తెరకెక్కిన ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అనువాద రూపంలో అందించారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై విశేషమైన అంచనాలను పెంచేసింది. ఆ అంచనాలను మన మణిరత్నం సార్ అందుకోన్నారో లేక అంచనాలను మించిన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందించారో చూద్దాం..!!
కథ : ఒక వీధి రౌడీగా తన ప్రస్థానాన్ని ఆరంభించి.. రాజకీయాలను సైతం శాసించే స్థాయికి ఎదిగిన వ్యక్తి భూపతి రాజు (ప్రకాష్ రాజ్) మరియు ఆయన సతీమణి (జయసుధ) గుడికి వెళ్లొస్తుండగా.. వాళ్ళ మీద సడన్ ఎటాక్ జరుగుతోంది. ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడినప్పటికీ.. భూపతి రాజు తర్వాత “కింగ్ పిన్” ఎవరు? అనే ప్రశ్న అతని కుమారులు వరద (అరవింద స్వామి), త్యాగు (అరుణ్ విజయ్), రుద్ర (శింబు) నడుమ తలెత్తుతుంది. వీరికి పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి అండగా నిలుస్తుంటాడు రసూల్ (విజయ్ సేతుపతి).
ఆ ప్రశ్నకు సమాధానం కోసం జరిగిన పోరాటమే “నవాబ్” కథాంశం.
నటీనటుల పనితీరు : సాధారణంగా సినిమాల్లో ఒక నటుడు లేదా ఇద్దరు ముగ్గురు చక్కగా నటించారు అని చెబుతుంటాం. కానీ.. “నవాబ్” సినిమాలో నటించిన ప్రతిఒక్కరూ ఆఖరికి రౌడీ గ్యాంగ్స్ లో కుర్రాళ్ళు కూడా అద్భుతమైన నటన ప్రదర్శించారు.
తండ్రి తన విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడాన్ని అణిచివేతగా భావించే పెద్ద కొడుకుగా అరవిందస్వామి. తనకు బ్రతకడానికి రెక్కలు ఇచ్చినా అంతా తండ్రి చెప్పుజేటల్లోనే జరుగుతోందని మదనపడే రెండో కొడుకుగా అరుణ్ విజయ్. తన తండ్రికి ఇష్టం లేకుండా పుట్టినవాడ్ని అని ఎల్లప్పుడూ తనను తాను తక్కువగా చూసుకొనే మూడో కొడుకుగా శింబు. అరవిందస్వామి భార్య పాత్రలో జ్యోతిక, అదే అరవిందస్వామి ఉంపుడుగత్తెగా అదితిరావు హైదరీ, సస్పెన్షన్ లో ఉంటూ కూడా పోలీస్ ఉద్యోగం చేసే ఎస్సైగా విజయ్ సేతుపతి.. వీళ్ళందరికీ పెద్ద దిక్కుగా ప్రకాష్ రాజ్, అతడి భార్యగా జయసుధ.. ఇలా చెప్పుకుంటూ పోతే.. లిస్ట్ సరిపోదేమో. అందరూ అద్భుతంగా నటించారు.
సాంకేతికవర్గం పనితీరు : “స్పైడర్” సినిమా చూసిన చాలా మంది “ఈ సినిమాటోగ్రఫీ వర్క్ ఏంటి ఇలా ఉంది” అనుకొన్నారు. సినిమాటోగ్రాఫర్ ఎవరో కూడా చాలామందికి తెలియదు. తెలిసిన నేను కూడా సినిమా నుంచి బయటకు వచ్చిన చాలా సేపు “ఏంటి ఆ ఫ్రేమ్స్ అన్నీ సంతోష్ శివన్ గారివా?” అని ఆశ్చర్యపోయాను. అలా ఆయనపై పడిన మరకను :నవాబ్” సినిమాతో తునాతునకలు చేశారు సంతోష్ శివన్. క్లైమాక్స్ లో వచ్చే కార్ రొటేటింగ్ సీక్వెన్స్ ఒక్కటి చాలు ఆయన అనుభవం, పనితనం ప్రేక్షకులకు తెలియడానికి. అసలు సినిమాలో కొన్ని ఫ్రేమ్స్ చూస్తే థియేటర్ లో గట్టిగా “భయ్యా ఒకసారి పాజ్ చేయవా ఫోటో తీసుకుంటాను” అని అరవాలి అనిపించింది. అసలు ఎలా వస్తాయ్ ఆ ఆలోచనలు, ఆ యాంగిల్స్, ఫ్రేమ్స్ సంతోష్ శివన్ తప్ప మరెవరూ కనీసం ప్రయత్నించలేరు కూడా. ఈ సినిమా డిజిటిల్ రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ప్రతి సినిమా అభిమాని వేచి చూసేలా చేశాడు సంతోష్ శివన్.
(నోట్: “స్పైడర్” సినిమా విడుదలై నేటికీ సరిగ్గా ఏడాది అవ్వడం వల్లనే ఆ సినిమాను సంతోష్ శివన్ వర్క్ కోసం రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగిందే తప్ప ఆ సినిమాను కించపరిచే ఉద్దేశ్యం మాకు లేదు)
బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఒక సినిమా ఫేట్ & ఫీల్ ను ఎలా మార్చేయోచ్చే ఈ సినిమాతో మరోమారు ప్రూవ్ చేశాడు రెహమాన్. సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క పాట కూడా ఉండదు. కానీ.. ప్రతి సన్నివేశానికి బ్యాగ్రౌండ్ లో ఒక సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది. సినిమా మూడ్ లోకి ఆడియన్స్ ను గ్రాబ్ చేయడానికి రెహమాన్ సంగీతం ఒక మత్తు ఇంజక్షన్ లా పనిచేసింది.
మణిరత్నం అసిస్టెంట్ అయిన శివ అనంత్ (“చుక్కల్లో చంద్రుడు” డైరెక్టర్ కూడా) ఈ సినిమాకి రైటర్ గా వర్క్ చేయడం విశేషం. మణిరత్నం ప్రతి సినిమాకి శివ వర్క్ చేసినప్పటికీ.. ఈ సినిమాకి ఆయన చేసిన వర్క్ మాత్రం స్పెషల్. ఒక స్ట్రయిట్ స్క్రీన్ ప్లే తో ఒక థ్రిల్లర్ డ్రామాను ఎలా నడిపించవచ్చు అనేందుకు భవిష్యత్ దర్శకులకు-రచయితలకు “నవాబ్” చిత్రం ఒక టెక్స్ట్ బుక్ లా పనికొస్తుంది.
ఇక మన మహా దర్శకులు మణిరత్నం పనితనాన్ని విశ్లేషించే స్థాయి, అనుభవం నాకు లేదు కానీ.. ఒక విశ్లేషకుడిగా కాదు ఒక ప్రేక్షకుడిగా నాకు సినిమా చూస్తున్నప్పుడు కలిగిన అనుభూతిని పంచుకోవాలనుకొంటున్నాను… “ఎ మణిరత్నం ఫిలిమ్” అనే ఫ్రేమ్ తో సినిమా మొదలైనప్పుడే ఒక తెలియని ఆనందం, పెదవిపై చిరునవ్వు.తో సీట్ లో కదలకుండా ఫోన్ సైలెంట్ లో పెట్టి కూర్చున్నాను. ఓపెనింగ్ షాట్ తోనే “ఇది మణిరత్నం సినిమా” అని మరోసారి కాస్ట్ లేట్ గా వచ్చి కూర్చుంటున్న ప్రేక్షకుడికి గుర్తు చేశారు. సినిమా కలర్ టోన్, ఫ్రేమ్స్, కెమెరా యాంగిల్స్.. వీటన్నిటికీ మించి కథ, కథలో అంతర్యుద్ధం చూస్తున్నప్పుడు ఒక గొప్ప సినిమా చూస్తున్న అనుభూతి, కానీ.. నెక్స్ట్ సీన్ ఏంటి అనేది మాత్రం నా బుర్రకు తట్టడం లేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ సోఫా మీద పడేసరికి అర్ధమైంది.. ఆ పొజిషన్ కి ఎవరు వస్తారు అనేదాని మీదే సెకండాఫ్ మొత్తం ఉంటుందని. వెంటనే వాష్ రూమ్ కి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని ఎక్కడ సినిమా మొదలైపోతుందేమోనన్న కంగారులో పరిగెట్టుకుంటూ వచ్చి నా సీట్ లో ల్యాప్ టాప్ బ్యాగ్ ఒడిలో పెట్టుకొని కూర్చున్నాను. ఎప్పట్లానే అసలు ఎక్స్ పెక్ట్ చేయని సీన్ తో సెకండాఫ్ స్టార్ట్ అయ్యింది. ఈసారి అంతర్యుద్ధం కాస్త ప్రచ్చన్న యుద్ధంగా రూపాంతరం చెందింది.
“ఇంతకీ అసలు విలన్ ఎవరు?” అని మనసులో అలికిడి, మెదడులో అలజడి. సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏంటి ఇంకా విలన్ ఎవరో తెలియడం లేదు అనే అసహనంతోపాటు ఏంటి సినిమా అప్పుడే అయిపోతుందా అనే అసంతృప్తి మొదలయ్యాయి. సినిమా క్లైమాక్స్ మొదలైంది.. ప్రచ్చన్న యుద్ధం కాస్తా మహా యుద్ధంగా మారింది. ఈసారి ముసుగులో గుద్దులాటలు లేవు, గన్నులు, బుల్లెట్లే మాట్లాడుతున్నాయి. నా మనసులో-మెదడులో అప్పటికే చిన్నసైజు పిచ్చుకు గూడులా పేరుకుపోయిన ప్రశ్నలకు సమాధానాలు రావడం మొదలయ్యాయి. ఒక్కో సమాధానం మైండ్ బ్లాంక్ చేస్తుంది. దానికి తోడు ఆ సీక్వెన్స్ ను రొటేటింగ్ ఫార్మాట్ లో తీసిన విధానం నా బుర్ర తిరిగేలా చేసింది. విజయ్ సేతుపతి ఇచ్చిన ట్విస్ట్ తో ఒక్కసారిగా నాకు పట్టిన మబ్బు విడిపోయింది. సినిమాకి ఎండి క్రెడిట్స్ పడ్డాయి. అప్పుడు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లా ఇచ్చిన ఎండ్ క్రెడిట్స్ తో ఉన్న చిన్న చిన్న అనుమానాలు కూడా పోయాయ్. ఏంటి సినిమా ఇంతలా నచ్చేసింది నాకు, నాకు మాత్రమే నచ్చిందా? అని డౌట్ వచ్చింది కానీ.. చుట్టూ ఉన్న ప్రేక్షకుల కళ్ళలో కనిపించిన మెరుపు నా డెసిషన్ కరెక్టే అని ప్రూవ్ చేయడంతో.. చాలా సంతోషంగా జేబులో చేతులు పెట్టుకొని థియేటర్ నుంచి “మా మణిరత్నం ఈజ్ బ్యాక్” అనుకుంటూ నడుచుకుంటూ వెళ్లిపోయాను (శూన్యంలోకి కాదు పార్కింగ్ దగ్గరకి)”.
(గమనిక : ఒక విశ్లేషకుడిగా కాక ప్రేక్షకుడిగా, సినిమా అభిమానిగా ఇచ్చిన సమీక్ష ఇది. దీనికి కూడా కామెంట్ బాక్స్ లో “నీకు తమిళ సినిమాలు మాత్రమే నచ్చుతాయి, తెలుగు సినిమాలు నచ్చవా నీకు, ఎంత తీసుకున్నావ్ ప్రమోషన్ కి?” అని అడిగితే ఆ అమాయకత్వం చూసి నవ్వుకోవడం తప్ప రిప్లై కూడా ఇవ్వాలి అనిపించదు).
విశ్లేషణ : అప్ కమింగ్ రైటర్స్ & డైరెక్టర్స్ కి ఒక థ్రిల్లర్ సినిమా ఎలా తీయొచ్చు, స్క్రీన్ ప్లే రాసుకోవడంలో సరికొత్త మెళకువలు వంటి వాటికి ఒక రెండున్నర గంటల క్లాస్ “నవాబ్” చిత్రం. సగటు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఈ చిత్రం. సొ, తప్పకుండా ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసి ఆస్వాదించండి.
రేటింగ్ : 3/5