ఇటీవల ధనుష్ (Dhanush) – నయనతార(Nayantara) మధ్య జరిగిన వివాదం ఇండస్ట్రీలో చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. నయనతార డాక్యుమెంటరీ “నయనతార: బియాండ్ ది ఫెయిరీ” విడుదల సందర్భంగా, నానుమ్ రౌడీ ధాన్ చిత్రంలోని కొన్ని క్లిప్పింగ్స్ ఉపయోగించడంపై ధనుష్ లీగల్ నోటీసులు పంపించడం వివాదానికి కారణమైంది. దీనిపై నయనతార మొదటిసారి స్పందిస్తూ, తన పక్షాన్ని ఖచ్చితంగా వెల్లడించారు. నయనతార మాట్లాడుతూ, “నేను కేవలం పబ్లిసిటీ కోసం ఎదుటివారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేసే వ్యక్తిని కాదు. నిజమే నా ధైర్యానికి ఆధారం.
నిజం మాత్రమే నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ వివాదంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. నేను ధనుష్‌తో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుకున్నా, అతను స్పందించలేదు. అందుకే ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పే పరిస్థితి వచ్చింది” అన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించి, “మేము వాడినవి కేవలం బీటీఎస్ విజువల్స్ మాత్రమే. అయితే వాటిని కూడా వివాదానికి దారి తీసేలా చేశారు. ధనుష్ సినిమాతో మాకు ఉన్న అనుబంధం కారణంగా, ఆయన ఒప్పుకోవాలని ఆశించాం.
కానీ చివరకు పరిస్థితులు ఇంత దూరం వచ్చాయి. నేను అతనితో మాట్లాడటానికి ఎన్నో ప్రయత్నాలు చేసా. కానీ అవి ఫలించలేదు” అని చెప్పారు. నయనతార తన బాధను వ్యక్తపరుస్తూ, “మన మధ్య ఏ సమస్య ఉందో కనీసం తెలుసుకోవాలని మాత్రమే కోరుకున్నా. మనం శత్రువులుగా ఉండే అవసరం లేదు. కానీ తప్పొప్పులను వివరించుకోవడం ముఖ్యం. నేను ఆయన సినిమాల పట్ల ఎప్పటికీ గౌరవం కలిగి ఉంటాను. కానీ ఈ ఘటన కొంచెం బాధ కలిగించింది.
ఎవరికి ఎలాంటి రైట్ ఉండాలో వారు నిర్ణయించుకోవచ్చు, కానీ సరైన కమ్యూనికేషన్ లేకపోవడం అనవసరమైన ఉద్రిక్తతకు దారి తీసింది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మౌనం బలహీనతలా అనిపిస్తుంది. నేను కేవలం సమస్యను క్లియర్ చేసుకోవాలని మాత్రమే కోరుకున్నా. ఇలాంటి విషయాలు భవిష్యత్‌లోనైనా చర్చల ద్వారా పరిష్కారం కావాలని కోరుకుంటున్నా” అని నయనతార (Nayanthara) తెలిపారు.