బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నిర్మాత కూడానూ. ఆయన బ్యానర్ మీద తరచూ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. అందులో ఎక్కువ శాతం తనే హీరోగా నటిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన బ్యానర్‌లో మరో సినిమా ప్రారంభమవబోతోంది. అయితే ఆ సినిమాకు ఆయన నిర్మాత మాత్రమేనట. హీరోగా నటించే అవకాశం వచ్చినా కేవలం నిర్మాత అవ్వడానికే ఆయన మొగ్గు చూపారట. ఇద్దరు యువ హీరోలతో సినిమాను నిర్మిస్తారట. అంతేకాదు ఓ హీరోయిన్‌ని ఈ సినిమాతో డైరక్టర్‌గా మారుతున్నారట.
ఆ హీరోయిన్ మనకు బాగా పరిచయస్థురాలే. ‘చిరుత’ సినిమాతో టాలీవుడ్‌లో రామ్‌చరణ్‌తో కలసి ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మనే ఆ దర్శకురాలు కాబోయే హీరోయిన్. 1945 నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా సాగే ఈ కథను ఆమె ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేది, మోహిత్ రైనా కీలక పాత్రల్లో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను ఓటీటీ కోసం సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది.
ప్రస్తుతం నేహా శర్మ ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు చూస్తోందట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే అక్టోబరులో ఈ సినిమా ప్రారంభమవుతుంది అని సమాచారం. నేహా శర్మకు ఇటీవల కాలంలో సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంది. జిమ్ ఫొటోలు, గ్లామర్ క్లిక్‌లతో నేహాకు సోషల్ మీడియాలో మంచి బజ్ ఉంది. సినిమాలు ఆపేసింది కదా అని అనుకుంటుండగా.. ఇప్పుడు మెగా ఫోన్ పట్టుకోవడానికి రెడీ అయిపోతోంది. ఇలా యంగ్ ఏజ్‌లో డైరక్టర్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ మాటకొస్తే చాలా తక్కువమంది ఉన్నారు. మరిప్పుడు నేహా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.
‘చిరుత’తో కెరీర్ ప్రారంభించిన నేహా ఆ తర్వాత తెలుగులో ‘కుర్రాడు’లో నటించింది. ఆ తర్వాత మొన్నీమధ్య ‘హాయ్ నాన్న’ సినిమాలో కేమియో చేసింది. అయితే ఇతర భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది.