సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదలవుతుంది అంటే కనీసం రెండు వారాల ముందు నుంచీ హడావుడి మొదలవుతుంది. ముఖ్యంగా.. ప్రీబుకింగ్స్ అని, ప్రీరిలీజ్ బజ్ అనీ నానా హంగామా చేస్తారు. కానీ.. మాస్ మహారాజా రవితేజ సినిమా ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉండగా.. కనీస స్థాయి బజ్ లేకపోవడం ఆయన అభిమానులనే కాక ఇండస్ట్రీ వర్గాలను కూడా విస్మయానికి గురి చేస్తోంది. రవితేజ కంటే కెరీర్ పరంగా చిన్నవాడైన కళ్యాణ్ రామ్ సినిమా “నా నువ్వే’కు ఉన్న బజ్ లో సగం కూడా “నేల టికెట్టు” సినిమాకు లేదు.
రెండేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండడం, మునుపటి సినిమా డిజాస్టర్ కావడం వంటి విషయాలు పక్కన పెట్టేస్తే.. రవితేజ కూడా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోడు. మంచి స్క్రిప్ట్ పడాలే కానీ.. ఇండస్ట్రీ హిట్ కొట్టగల సత్తా ఉన్న కథానాయకుడు ఆయన. అటువంటి రవితేజ సినిమా ఈ శుక్రవారం (మే 25) విడుదలవుతుందని కూడా పెద్దగా ఎవరికీ తెలియకపోవడం చర్చనీయాంశం అయ్యింది. “సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం” చిత్రాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద కనీస స్థాయి ఇంప్రెషన్ తీసుకురాలేకపోయాయి.
ముఖ్యంగా రవితేజ లాంటి స్టార్ హీరో సినిమాకి చేయాల్సిన మినిమం పబ్లిసిటీ కూడా ఈ సినిమా కోసం చేయకపోవడంతో రవితేజ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవుట్ పుట్ మీద నమ్మకం లేక ఇలా చేస్తున్నారా లేక ఎక్కువ హైప్ ఇవ్వడం ఇష్టం లేదా అనే విషయాల్ని కూడా పరిగణలోకి తీసుకొన్నప్పటికీ.. ఈ విధంగా రవితేజ లాంటి మాస్ హీరో సినిమాకి కనీసం యంగ్ హీరో సినిమాకి చేస్తున్న ప్రమోషన్ లో సగం కూడా చేయకపోవడం అనేది ముమ్మాటికీ తప్పే.