NET Movie Review: నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

తమడ కంటెంట్ ప్రొడక్షన్ సంస్థ ప్రొడ్యూస్ చేసిన వెబ్ ఫిలిమ్ “నెట్”. జీ5 తో కలిసి ప్రొడ్యూస్ చేసిన ఈ వెబ్ ఫిలిమ్ జీ5 యాప్ లో నేడు (సెప్టెంబర్ 10) విడుదలైంది. రాహుల్ రామకృష్ణ, ఆవికా గోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ వెబ్ ఫిలిమ్.. వర్చువల్ ప్లెజర్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ ఫిలిమ్ ఒటీటీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

కథ: లక్ష్మణ్ (రాహుల్ రామకృష్ణ) తెలంగాణ రాష్ట్రంలోని ఓ పల్లెటూరిలో ముబైల్ షాప్ రన్ చేస్తూ.. సాధారణ జీవితం సాగిస్తుంటాడు. ముబైల్ షాప్ తో లాభాలు రాక, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సుచిత్ర (ప్రణీత పట్నాయక్)తో సంతోషంగా ఉండలేక మదనపడుతుంటాడు. ఈ ఫ్రస్టేషన్ లో లక్ష్మణ్ కి దొరికిన ఏకైక రిలీఫ్ “అశ్లీల చిత్రాలు”. ఆన్లైన్ లో దొరికే అశ్లీల చిత్రాలు చూస్తూ టైమ్ పాస్ చేస్తుంటాడు. కొన్నాళ్ళకి వాటికి అడిక్ట్ అయిపోయి వేలల్లో డబ్బు పోగొట్టుకోవడమే కాక వ్యక్తిగా దిగజారిపోతుంటాడు.

అలాంటి తరుణంలో ఆన్లైన్లో అశ్లీల చిత్రాల బదులు ఇళ్ళల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ కు లైవ్ లో స్ట్రీమ్ చేసే ఒక వెబ్ సైట్లో ప్రియా (ఆవికా గోర్)ను చూసి, ఆన్లైన్లో ఆమె అందాలను ఆస్వాదించడం కోసం అప్పులు చేసి మరీ సబ్ స్క్రిప్షన్ కొంటుంటాడు. ఆ సమయంలో ప్రియా బాయ్ ఫ్రెండ్ ఆమెను మోసం చేస్తున్నాడని గ్రహించి, ఆమెకు ఆ మెసేజ్ అందజేయాలని నానా పాట్లు పడుతుంటాడు.

చివరికి ప్రియాకు లక్ష్మణ్ తాను చెప్పాలనుకున్న విషయం చెప్పగలిగాడా లేదా? లక్ష్మణ్-సుచిత్రల వైవాహిక జీవితం ఏ తీరానికి చేరింది? అనేది “నెట్” వెబ్ ఫిలిమ్ చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: శృంగారం పట్ల విపరీతమైన వ్యామోహం కలిగిన వ్యక్తిగా రాహుల్ రామకృష్ణ అద్భుతంగా నటించాడు. అతడి పాత్రకు ప్రెజంట్ జనరేషన్ యూత్ మాత్రమే కాదు చాలా మంది అంకుల్స్ కూడా కనెక్ట్ అవుతారు. భార్యతో శృంగారం జరిపేప్పుడు ఆన్లైన్లో లేదా బయట చూసిన అమ్మాయిలను ఊహించుకొనే సన్నివేశాల్లో రాహుల్ ఎక్స్ ప్రెషన్స్ నేచురల్ గా ఉండడమే కాక నవతరం పెళ్లి-ప్రేమ జంటలకు కనెక్ట్ అవుతాయి కూడా. చాలా సీరియస్ పాత్రను సబ్టల్ గా ప్లే చేశాడు రాహుల్.

ఆవికా గోర్ క్యారెక్టర్ కి సరైన జస్టీఫికేషన్ ఇవ్వలేదు కానీ.. ఆమె నటన మాత్రం ఆకట్టుకుంది. సగటు పడతిగా ప్రణీత పట్నాయక్ జీవించేసింది. భర్తను తనను హేయంగా చూస్తున్నా.. తన స్నేహితుల భార్యలతో కంపేర్ చేసి, తక్కువగా చూస్తూ బాధపెడుతున్నా భరించే భార్యగా ఆమె నటన ప్రశంసనీయం. విశ్వదేవ్ డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ప్రణీత పట్నాయక్ తమ్ముడి పాత్రలో విష్ణు అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు భార్గవ్ మాచర్ల రాసుకున్న కాన్సెప్ట్ నేటితరానికి ఓ నీతి కథ లాంటిది. ఇంటర్నెట్ ప్రపంచంలో జనాలు తమ అస్తిత్వాన్ని ఎలా కోల్పోతున్నారు? వైవాహిక జీవితాలు ఎలా ఛిద్రమవుతున్నాయి? వంటి అంశాలను అర్ధవంతంగా తెరకెక్కించిన విధానం బాగుంది. అయితే.. కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాడు. సైబర్ నేపధ్యంలో తెరకెక్కే సినిమాలకి లాజిక్స్ చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుంచుకుంటే ప్రేక్షకులు ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేవారు.

అయినప్పటికీ.. దర్శకుడిగా అతడు చెప్పాలనుకున్న అంశాలను మెచ్చుకోవాల్సిందే. నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం బాగుంది. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సీసీటీవీ ఫుటేజ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడి ఉంటే నేచురల్ గా ఉండేది. 90 నిమిషాల నిడివి ఈ వెబ్ ఫిలిమ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

విశ్లేషణ: నేటితరానికి “నెట్” తప్పకుండా చూడాల్సిన వెబ్ ఫిలిమ్. రాహుల్ రామకృష్ణ ట్విట్టర్లో ప్రమోట్ చేస్తున్నట్లు దమ్మున్న సినిమా. భార్గవ్ మాచర్ల కథ-కథనం, రాహుల్-ప్రణీత పట్నాయక్ -అవికల నటన అలరిస్తుంది. ఓవరాల్ గా “నెట్” ఆకట్టుకుంటుంది.

రేటింగ్: 3/5

Click Here to Watch

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus