NETFLIX: టాలీవుడ్ స్టార్లకు నెట్‌ఫ్లిక్స్ షాక్.. ఆ ‘దోపిడీ’ ఇక చెల్లదు!

టాలీవుడ్ బడా హీరోలకు, నిర్మాతలకు ఇదొక గట్టి హెచ్చరిక. ఇన్నాళ్లూ ఓటీటీ అనేది కాసులు కురిపించే కల్పవృక్షంలా ఉండేది. థియేటర్లో సినిమా బోల్తా కొట్టినా, డిజిటల్ రైట్స్ రూపంలో సేఫ్ అయిపోవచ్చులే అనే ధీమా నిర్మాతలది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కంటెంట్ లేకుండా కేవలం స్టార్ ఇమేజ్‌ని నమ్ముకుంటే ఇకపై చిల్లిగవ్వ కూడా రాలదని డిజిటల్ దిగ్గజాలు తేల్చి చెప్పేస్తున్నాయి. టాలీవుడ్ ‘ఏటీఎమ్’కు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా తాళం వేసేసింది.

NETFLIX

ఒకప్పుడు హీరో ఎవరు? డైరెక్టర్ ఎవరు? అనే కాంబినేషన్ క్రేజ్ చూసి ఓటీటీ సంస్థలు కళ్లు మూసుకుని కోట్లు కుమ్మరించేవి. కానీ నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆ పాత పద్ధతికి మంగళం పాడేసింది. హైదరాబాద్‌లో తిష్ట వేసింది మన స్టార్ల సినిమాలను గుడ్డిగా కొనడానికి కాదు, మన నేల నుంచి వచ్చే ప్యూర్ లోకల్ కంటెంట్‌ను ప్రోత్సహించడానికి. వందల కోట్లు పెట్టి స్టార్ల ఫ్లాప్ సినిమాలు కొనే బదులు, తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన సిరీస్‌లు, ఒరిజినల్ సినిమాలు నిర్మించడానికే మొగ్గు చూపుతోంది.

ఈ అనూహ్య మార్పుకు కారణం మన వాళ్లే. భారీ రేట్లు పెట్టి కొన్న పెద్ద సినిమాలు స్ట్రీమింగ్‌లో ఆశించిన వ్యూస్ రాబట్టలేక చతికిలపడ్డాయి. దీంతో ఓటీటీలకు తత్వం బోధపడింది. పోస్టర్ చూసి మోసపోవడం కంటే, సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిక్ టాక్ చూసి రేటు నిర్ణయించడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చాయి. అంటే ఇకపై రిలీజ్ కు ముందే వచ్చే టేబుల్ ప్రాఫిట్స్ అనే మాటే ఉండదు. దమ్ముంటే థియేటర్లో ఆడుకోవాల్సిందే.

ఈ నిర్ణయం నేరుగా హీరోల జేబులకు చిల్లు పెట్టబోతోంది. నాన్ థియేట్రికల్ బిజినెస్ పేరు చెప్పి విపరీతంగా పెంచేసిన రెమ్యునరేషన్లకు ఇప్పుడు కళ్లెం పడనుంది. ఓటీటీ నుంచి వచ్చే ఆదాయం తగ్గితే, ఆటోమేటిక్‌గా బడ్జెట్ కంట్రోల్ అవుతుంది. సినిమా క్వాలిటీ మీద కాకుండా హీరోల ప్యాకేజీల మీద ఖర్చు పెట్టే రోజులు పోయాయి. నిర్మాత బతకాలంటే కంటెంట్ బాగుండాల్సిందే అనే పరిస్థితి వచ్చింది.

నిజానికి ఇది ఇండస్ట్రీకి ఒక మంచి పరిణామం. ఈటీవీ విన్ లాంటి ప్లాట్‌ఫామ్స్ ఇప్పటికే కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా అదే బాటలో నడిస్తే, కొత్త కథలకు, ప్రతిభ ఉన్న దర్శకులకు స్వర్ణయుగం వచ్చినట్లే. స్టార్‌డమ్ ముసుగు తొలగిపోయి, అసలైన కథాబలం ఉన్న సినిమాలే ఇకపై రాజ్యమేలుతాయి. నాణ్యత పెరగడానికి ఇదొక కరెక్ట్ డోస్ అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus