తెలుగు సినిమాల పర్సనాలిటీల గురించి ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించడం ఇటీవల కాలంలో మొదలైంది. ఆ మధ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి (S. S. Rajamouli) గురించి ప్రత్యేక కార్యక్రమం సిద్ధం చేసింది. ఇప్పుడు ఇదే కోవలో ఓ స్టార్ హీరో లైఫ్‌ను షార్ట్‌గా చూపించబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఈ మేరకు గత కొన్ని నెలలుగా షూటింగ్ కూడా నిర్వహిస్తున్నారు అని సమాచారం. త్వరలో ఓ మంచి డేట్‌ను పట్టి స్ట్రీమింగ్‌కి విడుదల చేస్తారు అని కూడా అంటున్నారు. ఈ ఘనత అందుకోబోయే హీరో రామ్‌చరణ్ (Ram Charan) అని తెలుస్తోంది.
సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రపంచస్థాయి గుర్తింపును సంపాదించడంలో మన టాలీవుడ్ హీరోలు ముందుంటున్నారు. అలా ఇప్పుడు రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమాతోనే ఈ గుర్తింపు ప్రారంభమైనా ఆ తర్వాత దానిని ఆయన కొనసాగిస్తున్నాడు. స్టార్ హీరో తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఏ హీరోకు రాని నెపోటిజం, లుక్ ట్రోలింగ్స్ వచ్చాయి చరణ్‌కు. ఆ తర్వాత ఏ నెపో కిడ్ కూడా ఎదగని స్థాయికి ఇప్పుడు ఎదిగి చూపించాడు.
ఇలాంటి అన్ని అంశాలను కలగలిపి నెట్‌ఫ్లిక్స్‌లో ఓ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది అని సమాచారం. అందులో టుస్సాడ్స్ మైనపు విగ్రహం గురించి కూడా ప్రస్తావన ఉండేలా రీసెంట్‌గా షూట్ చేశారు అని చెబుతున్నారు. దాంతోపాటు ‘గేమ్ ఛేంజర్’(Game changer) సినిమా సమయంలో అభిమానులను కలుసుకున్న సన్నివేశాలు కూడా ఉంటాయట. అలాగే అతని స్నేహితులు, సినిమా పరిశ్రమలోని ఫ్రెండ్స్ మాటలు కూడా అందులో ఉంటాయట. చరణ్ చేసిన కొన్ని గుప్త దానాల గురించి అందులో ప్రస్తావిస్తారు అని తెలుస్తోంది.
డాక్యుమెంటరీ షూటింగ్ దాదాపు పూర్తి అయిందని, తుది మెరుగులు దిద్దుకుని త్వరలో విడుదల చేస్తారని టాక్. అయితే ఇది తెలుగులో ఉంటుందా? లేక ఇంగ్లిష్‌లో ఉంటుందా అనేది చూడాలి. రాజమౌళి డాక్యుమెంటరీ, ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్పెషల్ డాక్యుమెంటరీల విషయంలో ఈ ఇబ్బంది వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.