“పుష్ప” తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియాని మించిన స్థాయిని దక్కించుకున్నాడు. అయితే.. పాన్ ఇండియన్ ఫేమ్ గేమ్ లో పడి సినిమాల సంఖ్యను తగ్గించేశాడు. “పుష్ప” 2021 డిసెంబర్ లో రిలీజైతే.. “పుష్ప 2” (Pushpa 2) 2024 డిసెంబర్ లో రిలీజ్ అయ్యింది. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనేది ఫైనల్ అవ్వడానికే నాలుగు నెలలు పట్టేసింది. పోనీ ఎట్టకేలకు అట్లీతో సినిమా ఓకే అయ్యింది కదా అనుకునేసరికి..
ఆ ప్రీప్రొడక్షన్ వర్క్ కే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, డిసెంబర్-2025కు కానీ సినిమా సెట్స్ కి వెళ్లడం కష్టమని తెలుస్తోంది. ఆ కారణంగా అట్లీ (Atlee Kumar) -అల్లు అర్జున్ ల సినిమా 2027 సంవత్సరానికి విడుదలవుతుందని, అది కూడా బన్నీకి అచ్చొచ్చిన డిసెంబర్ నెలకే అని తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ “పుష్ప 2” తర్వాత కనీసం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తానని చెప్పాడు. కానీ సినిమా స్కేల్ లేదా కాన్వాస్ బట్టి సినిమా, సినిమాకి మధ్య గ్యాప్ అనేది తప్పడం లేదు.
అల్లు అర్జున్ కెరీర్లో ఇలా ఇంత గ్యాప్ రావడం ఇదే మొదటిసారి. కెరీర్ మొదలుపెట్టినప్పటినుండి కచ్చితంగా ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేస్తూ వచ్చాడు బన్నీ. అందువల్ల అభిమానులు అతడ్ని ఎప్పుడూ మిస్ అవ్వలేదు. కానీ.. ఇప్పుడు ఈ విధంగా ఏళ్ల తరబడి గ్యాప్ రావడం అనేది కాస్త బాధాకరమే. తెలుగు సినిమా స్థాయిని కచ్చితంగా పెంచుకున్నారు.
అయితే.. ఏడాదికి కనీసం ఒక్క సినిమా చేస్తే.. ఇండస్ట్రీ బాగుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది. అయితే.. బన్నీ తదుపరి సినిమా కూడా త్రివిక్రమ్ తో (Trivikram) భారీ స్కేల్ సినిమా కావడంతో, ఆ సినిమాకి ఎన్నేళ్లు పడుతుందో, ఎప్పడు రిలీజ్ అవుతుందో అనే విషయంలో క్లారిటీ రావడానికే చాలా ఏళ్లు పట్టేలా ఉంది.