ఒక సినిమాను రెండు భాగాలుగా విడదీస్తున్నారు అంటే.. ఆ సినిమా నిడివి ఎక్కువ అయి ఉండాలి. లేదంటే ఒక భాగంలో చెప్పలేని పెద్ద కథను రాసుకుని ఉండాలి. అంతే కానీ ఒక సినిమాను రెండు ముక్కలు చేసి.. ఆ సినిమా, హీరో ఫేమ్‌ను క్యాష్ చేసుకోకూడదు. ఈ మాట మేం అనడం లేదు. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో రెండు ముక్కలు అవుతున్న సినిమాలు, వాటి ఫలితాలు చూస్తుంటే పరిస్థితి ఇలానే అనిపిస్తోంది. రెండు ముక్కలు అవుతున్న సినిమాల రెండో పార్టు మొదలుకావడానికి పడుతున్న ఇబ్బందులు చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
The RajaSaab movie
ఇప్పుడు ఈ చర్చంతా ఎందుకు అనుకుంటున్నారా? ‘ప్రభాస్ రాజాసాబ్’ సినిమాను కూడా రెండు పార్టులుగా విభజించిన నేపథ్యంలో ఈ డిస్కషన్ అంతా మొదలైంది. ‘రాజా సాబ్’ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎక్కడా రెండు ముక్కల ప్రస్తావన రాలేదు. అసలు ఆ అవకాశం ఉంది అనే లీక్ కూడా రాలేదు. అయితే ప్రచార చిత్రాల్లో కీలకంగా కనిపించిన ఓల్డేజ్ ప్రభాస్ లుక్‌ను కీగా చేసుకొని రెండో పార్టుకు టీమ్ రెడీ అయిపోయింది. ‘రాజా సాబ్ సర్కస్ 1935’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఇది ప్రీక్వెల్ కూడా కావొచ్చు.
ఇక్కడే డిస్కషన్ మొదలైంది. ఎందుకంటే ప్రభాస్ చేతిలో ఇప్పుడు రెండు సీక్వెల్స్ ఉన్నాయి. ‘సలార్: శౌర్యాంగ పర్వం’, ‘కల్కి 2’ సినిమాలు ఆయన చేయాల్సి ఉంది. ఆ రెండు పార్టులకు అవసరమైన కీ పాయింట్‌ని వాటి తొలి పార్టుల్లో వదిలేశారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అయితే ఆ సినిమాల ఫలితాలు వేరు. ఈ సినిమా ఫలితం వేరు. కాబట్టి ఈ సినిమా రావడం కష్టమే. మొన్నీమధ్య ‘కింగ్డమ్’ సీక్వెల్ ఇలానే క్యాన్సిల్ అయింది.
‘దేవర 2’ సంగతి ఇంకా తేలడం లేదు. ‘హరి హర వీరమల్లు’ పార్ట్ 2 పరిస్థితీ ఇంతే. ఇదంతా చూశాక ఎందుకిలా రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని ఇబ్బంది పెట్టడం అనే మాట పెద్దగా వినిపిస్తోంది. ఎందుకంటే రెండు ముక్కల మోజులో తొలి పార్టులో మొత్తం కథ చెప్పడం లేదు. దీంతో వెలితిగా అనిపిస్తోంది.