ఇద్దరు హీరోల మధ్య పోలిక చూడటం కొత్త విషయమేమీ కాదు. ఎన్నో ఏళ్లుగా ఇది చూస్తూనే ఉన్నాం. ఇద్దరిని పక్కనపక్కన పెట్టి ఈయన ఎన్ని సినిమాలు చేశాడు, ఎన్ని హిట్లు, ఎంత వసూళ్లు వచ్చాయి లాంటి వివరాలు లెక్కేస్తుంటారు. హీరోయిన్ల విషయంలో ఇది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్లు ఒకే స్థాయిలో ఉండటం కష్టం.. ఒకేసారి వచ్చిన హీరోయిన్లు అనే లెక్క దొరకడమూ కష్టమే. అయితే ఈ లెక్కలు కొన్ని లేకపోయినా..
ఇద్దరు హీరోయిన్లను పోలుస్తూ ఓ నెటిజన్ విమర్శ చేశాడు. దానికి ఆ ఇద్దరిలో ఒక హీరోయిన్ రియాక్ట్ అయింది. ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu) ‘ది రాజాసాబ్’ (The Rajasaab) సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న నిధి అగర్వాల్‌నే (Nidhhi Agerwal) ఇప్పుడు అలా రియాక్ట్ అయింది. ఆమెతో పోల్చిన హీరోయిన్ శ్రీలీల (Sreeleela). టాలీవుడ్‌లో ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ వరుస అవకాశాలు అయితే అంతగా రాలేదు. ఇప్పుడు ఆ రెండు పెద్ద సినిమాలు చేస్తోంది అంతే.
అయితే ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయి అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక అసలు విషయానికొస్తే.. ఓ నెటిజన్ శ్రీలీల ఫిల్మోగ్రఫీతో నిధి అగర్వాల్ సినిమాల లిస్ట్‌ను పోలుస్తూ వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టాడు. 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో నిధి అగర్వాల్ ఎంట్రీ ఇచ్చింది. 2021లో ‘పెళ్ళిసందD’ సినిమాతో శ్రీలీల మన దగ్గరకు వచ్చింది. అప్పటి నుండి ఇప్పటివరకు 20 సినిమాలు చేసింది అంటూ లెక్కలేశారు ఆ నెటిజన్. ఆ పోస్ట్ ఎలాగో నిధి కంట పడింది. దీంతో నా గురించి ఏమాత్రం బాధపడొద్దు అంటూ కౌంటర్ ఇచ్చింది.
అలాగే తన సినిమాల ఎంపిక వెనుక ఆలోచనను చెప్పింది. మంచి స్క్రిప్ట్ అనుకున్న వాటికే సంతకం చేస్తున్నా. అందుకోసం సమయం తీసుకుంటున్నాను అని క్లారిటీ ఇచ్చేసింది. అయితే తన నిర్ణయం కొన్నిసార్లు తప్పు అయి ఉండొచ్చని, కానీ మంచి సినిమాల్లో మాత్రమే భాగం కావాలనేది తన అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. వరుస సినిమాలు చేసేయాలనే తొందర ఏమీ లేదని, ఈ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నాను అని కూడా చెప్పింది. కాబట్టి నా గురించి ఏమీ బాధపడకు అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.