ఎవరినీ రానివ్వకుండా సినిమా షూటింగ్‌లు చేయడం గురించి మీరు వినే ఉంటారు. పెద్ద హీరోలు సినిమాలు, పాన్ ఇండియా సినిమాలకు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అయితే ఆ సినిమా షూటింగ్ అవుతోంది అని మాత్రం అందరికీ సమాచారం ఉంటుంది. కానీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ షూటింగ్ జరపడం గురించి మీకు తెలుసా? ఇప్పుడు నిఖిల్ (Nikhil Siddhartha) కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) రూపొందిస్తున్న ‘స్వయంభూ’ (Swayambhu) అలానే చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతుంది.
అయితే ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్ ఇప్పటివరకు పెద్దగా బయటకు రాలేదు. ఆ మధ్య ఎప్పుడో హీరోయిన్ల పుట్టిన రోజు సమయంలో పోస్టర్లు వచ్చాయి. ఎందుకు, ఏమిటి అనే విషయాలు పెద్దగా తెలియడం లేదు. అయితే తాజాగా నిఖిల్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ గురించి ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు. సినిమా 95 శాతం షూటింగ్ అయిపోయిందని చెపపాడు. ‘స్వయంభూ’ సినిమా కోసం ఏడాది నుండి సిద్ధమవుతున్నామని చెప్పిన నిఖిల్..
తన కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా అని చెప్పాడు. ఈ సినిమా దీని షూటింగ్‌ను రహస్యంగా చేస్తున్నామని, ఇప్పటికే 95 శాతం సినిమా షూటింగ్ పూర్తయిందని షాకింగ్ సమాచారం ఇచ్చాడు. దీంతో అప్పుడే అంత సినిమా అయిపోయిందా? ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. నిఖిల్ ఫ్యాన్స్ అయితే హ్యాపీ. ఇక ఫ్యాన్సే కాదు మొత్తం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘కార్తికేయ 3’ గురించి కూడా నిఖిల్ మాట్లాడాడు.
ఆ సినిమా కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పాడు. దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) స్క్రిప్ట్ సిద్ధం చేసేలోపు తన మరో సినిమా ‘ది ఇండియా హౌస్’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసేస్తామని నిఖిల్ చెప్పాడు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ టీమ్‌తో కలసి రామ్‌చరణ్ (Ram Charan) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.