“భద్రమ్, పిజ్జా 2” వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ నటుడు అశోక్ సెల్వన్ నటించిన తాజా చిత్రం “నిన్నిలా నిన్నిలా”. తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో జీప్లెక్స్ లో విడుదలైంది. రీతువర్మ, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!
కథ: దేవ్ (అశోక్ సెల్వన్) లండన్ లోని ఓ రెస్టారెంట్లో అసిస్టెంట్ చెఫ్ గా జాయిన్ అవుతాడు. చిన్నప్పటినుంచి వంట అంటే విపరీతమైన ఇష్టమున్న దేవ్.. రెసిపీని భిన్నంగా తయారు చేయడం వల్ల ఫుడ్ టేస్ట్ అదిరిపోతుంది. దేవ్ వంటలు వండే విధానం అక్కడి హెడ్ చెఫ్ (నాజర్)కు కూడా విపరీతంగా నచ్చుతుంది. అక్కడే చెఫ్ గా వర్క్ చేసే తార (రీతువర్మ)కు దేవ్ ఫుడ్ కుక్ చేసే విధానం అంటే ఇష్టం ఉన్నప్పటికీ.. కాస్త ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతుంది. అయితే.. దేవ్ కి కొన్ని ఫిజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఉన్నట్లుండి వింతగా బిహేవ్ చేస్తుంటాడు. దేవ్ అలా ఎందుకు బిహేవ్ చేస్తాడు? దేవ్ అసలు కథ ఏమిటి? దేవ్-తారల కథ ఏ తీరానికి చేరింది అనేది “నిన్నిలా నిన్నిలా” కథాంశం.
నటీనటుల పనితీరు: అశోక్ సెల్వన్ నటుడిగా చూపించిన వేరియెషన్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిగా, స్వచ్చమైన స్నేహితుడిగా, ప్రేమికుడిగా అశోక్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. నిజానికి అశోక్ ప్లే చేసిన దేవ్ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్. అలాంటి పాత్రలో నటించాలంటే చాలా హోంవర్క్ చేయాలి. అతని కష్టం తెరపై కనిపిస్తుంది. అతని డెడికేషన్ ను మెచ్చుకొని తీరాలి.నటిగా నిత్యామీనన్ లోని సరికొత్త యాంగిల్ ఈ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయంవుతుంది.
మణిరత్నం అంజలి పాప పెరిగి పెద్దదైతే ఎలా ఉంటుందో.. ఈ చిత్రంలో నిత్య పోషించిన మాయ పాత్ర అచ్చుగుద్దినట్లు అలానే ఉంటుంది. నిత్యామీనన్ ఆ పాత్రలో అంత క్యూట్ గా జీవించింది. ఆమె వాయిస్, క్యూట్ నెస్ చూస్తూ ప్రేక్షకులు మురిసిపోవడం ఖాయం. రీతువర్మకు మళ్ళీ తనలోని నటిని ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం లభించింది. ఆమె పాత్రకు మంచి వెయిట్ కూడా ఉంది. నాజర్, కేదార్ శంకర్, సత్యలు సినిమాకి మంచి వైబ్ ను యాడ్ చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: దివకార్ మణి సినిమాటోగ్రఫీ సినిమాకి టెక్నికల్ గా పెద్ద ఎస్సెట్. ఆయన లెన్స్ నుంచి చూసిన ఫుడ్ నూరూరిస్తే, ఎమోషన్స్ ను తనదైన శైలి లైటింగ్ & ఫ్రేమ్స్ తో ఎలివేట్ చేసిన విధానం ఆడియన్స్ ను సినిమాకి కనెక్ట్ చేస్తుంది. దర్శకుడు అని శశి ఒక రెగ్యులర్ కథను సరికొత్త ఫార్మాట్ లో తీశాడు. నూరూరిస్తూనే మనసుకు హత్తుకునేలా ఉంటుంది ప్రతి సన్నివేశం. ముగ్గురు పాత్రల నడుమ కెమిస్ట్రీ, ఎమోషనల్ రిలేషన్స్ ను హృద్యంగా తెరకెక్కించిన విధానం ప్రశంసనీయం. అన్నిటికంటే ప్రతి ఎమోషన్ కు ఫుడ్ ను కనెక్ట్ చేసి.. టేస్టీగా చూపించాడు. ప్రతి దర్శకుడికి ఒక విజన్ ఉంటుంది. కథ-కథనం తెరపై ఎలా ఉండాలి అనే విజన్ కు మంచి నటీనటులు తోడైతే ఎలా ఉంటుంది అనేందుకు “నిన్నిలా నిన్నిలా” మంచి ఉదాహరణ. తెలుగు నటీనటులు ఉండడం, తెలుగు వెర్షన్ ను ప్రత్యేకంగా షూట్ చేయడం వలన బైలింగువల్ ఛాయలు కానీ, తమిళ వాసన కానీ ఎక్కడా తగలదు.
విశ్లేషణ: ఒక సినిమా చూస్తున్నప్పుడు కథ-కథనంలోకి ప్రేక్షకుల్ని లీనం చేసే కొన్ని విషయాలు ఉంటాయి. అవి పాత్రలు కావచ్చు, కథనం కావచ్చు లేదా మూవీ కోర్ పాయింట్ అవ్వచ్చు. “నిన్నిలా నిన్నిలా”లో ఈ మూడు అంశాలు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ఒక మంచి సినిమా చూశామనే భావనతోపాటు, అర్జెంట్ గా ఏదైనా వండుకొని తినాలి అనే కోరికను కూడా కలిగిస్తుంది. నిత్యామీనన్ క్యూట్ యాక్టింగ్ కోసం, అశోక్ సెల్వన్ వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం, అని శశి టేకింగ్ కోసం ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.