సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద రసవత్తర పోరు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో నితిన్ కూడా చేరనున్నాడు. నటుడిగా కాదు పంపిణీదారుడిగా. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నైజం ఏరియాలో ప్రముఖ పంపిణీదారుడన్న సంగతి తెలిసిందే. నితిన్ కూడా ఆ వ్యవహారాలు చూస్తూ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిర్మాతగానూ మారాడు. ఆ కోవలోనే ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ నైజం హక్కులు దక్కించుకుని సంక్రాంతి సినిమాల విజయంలో తానూ భాగం పంచుకోనున్నాడు.
ఈ సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ ‘శాతకర్ణి’గా కనిపించనున్న సంగతి విదితమే. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రిష్ సొంత బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మితమవుతోంది. బాలయ్య వందో చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఎంత ప్రాధాన్యతను సంతరించుకుందన్నది సినీ జనాలకు తెలియంది కాదు. మేజర్ బిజినెస్ జరిగే నైజాం ఏరియా కోసం ఎంతోమంది పంపిణీదారులు పోటీ పడుతుంటారు. అందోలు దిల్ రాజు, అభిషేక్ వంటి హేమాహేమీలు ఉన్నారు. వారందరినీ దాటుకుని నితిన్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ లావాదేవీ 10-11 కోట్లు మధ్య జరిగిందని పరిశ్రమ వర్గాల గుసగుసలు. మరోవైపు ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఫ్యాన్సీ రేటు చెల్లించి సీడెడ్ హక్కుల్ని దక్కించుకున్నారట.