గత రెండు రోజులుగా నటి నివేదా థామస్ పై ట్రోలింగ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. కరోనా సోకడంతో క్వారెంటైన్ లో ఉండాల్సిన ఆమె సడెన్ గా ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్ లో కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ మూమెంట్ కోసమే ఎదురుచూశా అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. దీంతో నెటిజన్లు ఈ బ్యూటీపై మండిపడ్డారు. కోవిడ్ సోకిన వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా జనాల మధ్యకు ఎలా వస్తారంటూ ఆమెపై కామెంట్స్ చేశారు.
తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పై నివేదా స్పందించింది. తనకు కరోనా తగ్గిపోయిందని.. నెగెటివ్ వచ్చిందని తెలిసిన తరువాతే థియేటర్ లోకి వచ్చానని స్పష్టం చేసింది. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తనకు కోవిడ్ రావడం బాధగా అనిపించిందని.. కాయి మళ్లీ రైట్ టైమ్ లో నెగెటివ్ వచ్చిందని చెప్పింది. థియేటర్ కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నట్లు.. కానీ ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారని.. అందుకే ఆగిపోయానని తెలిపింది.
కానీ ఒక్కసారి బయటకి వెళ్లి థియేటర్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలనిపించిందని.. అందుకే వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. కోవిడ్ కారణంగా ప్రేక్షకులను నేరుగా కలవలేకపోతున్నప్పటికీ.. తనకు వచ్చిన మెసేజ్ లన్నీ కూడా చదువుతున్నానని వెల్లడించింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ మాస్క్ లు పెట్టుకొని, సామాజిక దూరం పాటిస్తూ ‘వకీల్ సాబ్’ సినిమాను థియేటర్లో చూడాలని కోరింది నివేదా థామస్.