తమ అభిమాన సినిమాను అందరికంటే ముందు తామే చూడాలన్న ఆశ అందరూ హీరోల ఫ్యాన్స్ కి ఉండేదే. అందుకోసమే “స్పెషల్ లేదా బెనిఫిట్ షో” అనే పద్ధతి విస్తృతమైంది. సినిమా విడుదల రేపు అనగా ముందు రోజు అర్ధరాత్రి లేదా రిలీజ్ తెల్లవారుఝామున అనగా ఉదయం 4 లేదా 5 గంటలకు స్పెషల్ షోలు నిర్వహించుకొని అభిమానులందరూ తమ హీరోను వెండితెరపై చూసుకొని మురిసిపోతూ కేకలు వేస్తూ, డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేయడం కోసం ఈ షోలు పనికొస్తుండేవి. సినిమా బాగుంటే ఈ స్పెషల్ షోల నుంచి వచ్చే పబ్లిక్ టాక్ సినిమాకి మైలేజ్ ఇచ్చేది. ఒకవేళ సినిమా యావరేజ్ అయితే మాత్రం వీకెండ్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే.. గత కొద్ది కాలంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర-తెలంగాణలో ఈ “స్పెషల్ షో”ల విషయంలో రచ్చ జరుగుతూనే ఉంది.
ఆంధ్రాలో స్పెషల్ షో పర్మిషన్ ఇచ్చి.. తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని కొందరు, ఇస్తే అందరికీ ఇవ్వాలి లేదంటే ఎవరికీ పర్మిషన్ ఇవ్వకూడదు అని ఇంకొందరు వాదించడం మొదలెట్టారు. అసలు “స్పెషల్ షో”లకు హైద్రాబాద్ లో పర్మిషన్ ఎందుకు ఇవ్వడం లేదని పోలీసు వారిని సంప్రదించగా.. “పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఇబ్బందేమీ లేదు. కానీ థియేటర్ దగ్గరల్లో ఉన్న ఫ్యామిలీస్ ఈ స్పెషల్ షోస్ కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి, ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలప్పుడు వారి అభిమానులు ఉదయం 4 గంటల నుండి తమ హీరోల బిరుదులు నినాదాలు చేయడం, పటాసులు కాల్చడం వంటి కారణంగా చుట్టుపక్కల నివసించేవారికి ఇబ్బందులు కలుగుతున్నాయి.
అంతేకాక ఉదయాన్నే ఆ థియేటర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది” అందుకే ఈ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇవ్వాలంటే పలుమార్లు ఆలోచించడం జరుగుతోంది అన్నారు. ఇకపోతే.. మహేష్ బాబు తాజా చిత్రం “భరత్ అనే నేను” విషయంలో మాత్రం పోలీసువారు ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదట, అసలే పోలిటికల్ డ్రామా కావడంతో పోలిటికల్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశాలు ఉండడంతో కేవలం తెలంగాణాలో మాత్రమే కాక ఆంధ్రాలోనే “స్పెషల్ షోస్” క్యాన్సిల్ చేశారు. ఐమాక్స్ లో పడే 8.45 షో ఇండియాలో పడే మొట్టమొదటి షో కావచ్చు లేదా “బ్రహ్మోత్సవం” తరహాలో రోజుకి అయిదు షోలు ప్లాన్ చేసే అవకాశాలున్నాయి. ఏదేమైనా.. తమ హీరో సినిమాని స్పెషల్ షోలో చూసి ఆనందిద్దామని ఎదురుచూసిన సూపర్ స్టార్ అభిమానులందరికీ ఇది చేదు వార్తే.