లాక్ డౌన్ అనంతరం టాలీవుడ్ లో విడుదలవుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘వకీల్ సాబ్’ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మూడేళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజప్పుడే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో హడావిడి చేశారు. ఇక సినిమా రిలీజ్ అంటే హంగామా ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఉత్సాహానికి కరోనా బ్రేకులు వేసేలా ఉంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, అదనపు షోలు ఏవీ కూడా సాధ్యపడే పరిస్థితి కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం రోజురోజుకి పెరిగిపోతుంది. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండడంతో.. ఈ సినిమాకు వంద శాతం ఆక్యుపెన్సీని కొనసాగించే విషయంలో కూడా పునరాలోచన చేసే పరిస్థితి నెలకొంది. అలాంటిది బెనిఫిట్ షోలు, అదనపు షోలు అంటే చాలా కష్టమని అంటున్నారు. ఇలా చూసుకుంటే..
అర్ధరాత్రి నుండి ఏపీలో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వేయడానికి ప్లాన్ చేసుకున్న అభిమాన సంఘాలు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. తెలంగాణలో ఐదో షోకి అనుమతులు రావడం కూడా అసాధ్యమేనని అంటున్నారు. మరోపక్క ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటే.. ఇప్పుడు దానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఒక స్టార్ హోటల్ లో అభిమానులు లేకుండా.. సింపుల్ గా ఈ ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ పరిణామాలన్నీ అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి.