రీల్ ‘గేమ్ ఛేంజర్’తో (Game Changer) రియల్ ‘గేమ్ ఛేంజర్’.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాట ఇదే. ఇదంతా ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసమే అని మీకు తెలిసే ఉంటుంది. మరి ఈ ఇద్దరు గేమ్ ఛేంజర్లను తెలుగు వాళ్లకు ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచానికి ఇచ్చిన అసలు సిసలు ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కి రావడం లేదా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా మెగా ఫ్యాన్స్‌ని వేధిస్తోంది.
తాజాగా, దీనికి సమాధానం దొరికింది. పుకార్లు వస్తున్నట్లుగానే చిరంజీవి ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాత్రమే వస్తున్నారట. దీంతో చాలా గ్యాప్ తర్వాత మెగా స్టార్ – మెగా పవర్ స్టార్ – పవర్ స్టార్‌ను చూద్దామనే ఫ్యాన్స్ కోరిక నెరవేరడం లేదు. జనవరి 4న రాజమహేంద్రవరంలో ఈ సినిమా ఈవెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. అక్కడ కేవలం పవర్ స్టార్ – మెగా పవర్ స్టార్‌ని మాత్రం చూడగలం.
ఇదంతా ఓకే చిరంజీవి (Chiranjeevi) ఎందుకు రావడం లేదు అనే డౌట్‌కి ఆన్సర్ కూడా వచ్చేసింది. జనవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ కాటలిస్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దానికి చిరునే చీఫ్ గెస్ట్. ఈ మేరకు ఒక వీడియో సందేశం ద్వారా ఆయన ఇప్పటికే ఆ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ ఈవెంట్‌కే ప్రాధాన్యం ఇస్తారు అని తెలిసింది.
మరోవైపు ఈవెంట్‌కి చిరంజీవి కూడా వస్తే.. ఆ జనాల్ని అదుపు చేయడం అంత ఈజీ కాదని భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ రోజు చిరంజీవి వీడియో సందేశం ఈవెంట్‌లో ప్రదర్శిస్తారు అని చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. అన్నట్లు ఈవెంట్‌ను విజయవాడలో నిర్వహిస్తారు అనే ఓ టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అది పవన్ ఇచ్చే టైమ్ బట్టి ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు.