గత కొద్ది రోజులు మలయాళ సినిమా పరిశ్రమలో ఓ సినిమా గురించి తెగ మాట్లాడుతున్నారు. అదే ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. ఈ సినిమా గురించి ఇలా అందరూ డిస్కస్ చేసుకోవడానికి కారణం ఆ సినిమా టైటిలే. వాదనలు, వివాదాల చుట్టూ తిరిగిన ఈ సినిమా ఇప్పుడు అన్ని సమస్యలు తీర్చుకుని విడుదలయ్యే దారి కనిపిస్తోంది. కేంద్ర మంత్రి, నటుడు సురేశ్ గోపి, ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది.
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి సెన్సార్ బోర్డు నిరాకరించడంతో ఈ సినిమా వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత కాలం అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డ్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. తాము ముందు చెప్పిన విధంగా 96 కట్స్ వద్దని కేవలం రెండే మార్పులు చేస్తే చాలు అని తెలిపింది. ఈ మేరకు సెన్సార్ బోర్డ్ తరఫు న్యాయవాది కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. సినిమా టైటిల్ విషయంలో చిన్న మార్పు చేయమని కోరారు.
‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ అనే పేరును ‘వి.జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ లేదా ‘జానకి.వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా మార్చమని సెన్సార్ బోర్డు హైకోర్టు ముందు తెలిపింది. సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయమని కూడా కోరింది. అలా చేయకపోతే ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం ఉందని, దాని వల్ల కొన్ని వర్గాల వారి మనోభావాల టాపిక్ వస్తుందని సెన్సార్ బోర్డు వాదనల్లో పేర్కొంది.
వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఒక నిర్ణయానికి వచ్చి, అభిప్రాయాన్ని తెలియజేయాలని చిత్ర బృందాన్ని ఆదేశించింది. సినిమా విషయంలో ఇప్పటికే ఆలస్యం జరిగిన నేపథ్యంలో చిత్రబృందం పేరులో చిన్న మార్పునకు ఓకే చెప్పొచ్చు అని సమాచారం.