ఒకప్పటి స్టార్ కమెడియన్ అలీ.. తాజాగా కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం ఆయనకి పెద్దగా అవకాశాలు లేవు. ఒకప్పటితో పోలిస్తే అతని లుక్ మారిపోయింది. అందువల్ల స్టార్ డైరెక్టర్స్ అతన్ని పెద్దగా ఫోకస్ చేయడం లేదు. అలీకి వచ్చే రోల్స్ కూడా లిమిటెడ్ రన్ టైంతో కూడుకున్నవే. అయితే ఇప్పుడు అలీకి సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాలో లెన్తీ రోల్ దొరికింది.
అందుకు అతను ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అలీ మాట్లాడుతూ… “ఓ భామ అయ్యో రామా’ సినిమాలో నేను సుహాస్ కి మామయ్య పాత్ర చేశాను. దర్శకుడు ‘ఈ పాత్ర మీరు చేస్తే బాగుంటుందండీ’ అని అడిగినప్పుడు…. ‘ఎంతిస్తారు? అని నేను అడగలేదు.
ఎన్ని రోజులు కాల్షీట్స్ కావాలి’ అని అడిగాను. ఎందుకంటే… 15 ఏళ్ళ క్రితం నాకు ఒక మేనల్లుడు ఉండేవాడు. మా అక్క.. నా మేనల్లుడు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. దీంతో వాడిని మా అమ్మ తీసుకొచ్చి పెంచింది. నా ముందే ఎదిగాడు. కానీ ఒక అమ్మాయిని ప్రేమించి… ఆ అమ్మాయి నో చెప్పిందని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
అప్పటి నుండి మా అమ్మ… 2 ఏళ్ళ పాటు ఏడుస్తూనే ఉంది. మనవడు అయినా కొడుకులానే భావించింది. ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పినప్పుడు నేను దానికి కనెక్ట్ అయిపోయాను.అందుకే వెంటనే ఓకే చెప్పేశాను. సినిమాలో హీరో సుహాస్ ని చూస్తుంటే నాకు నా మేనల్లుడే గుర్తొచ్చాడు” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.