వర్మపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం

సీరియస్ అవుతుందని అనుకున్న విషయాలు సింపుల్ గా అయిపోతాయి. లైట్ గా తీసుకునేవి కొన్ని సార్లు సీరియస్ అవుతుంటాయి. అదే పరిస్థితిని రామ్ గోపాల్ వర్మ ఎదుర్కొన్నారు. అతను పెద్ద వారిపై కామెంట్ చేసి వారి నుంచి బయటపడ్డారు. కానీ చిన్న విషయంలో పీకలమీదకు తెచ్చుకున్నారు. వివరాల్లోకి వెళితే… వర్మ 2009 లో ‘అగ్యాత్’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ ఆ సినిమా కథ తనదంటూ రచయిత సిద్ధిక్ ముస్తాక్ ముహసిన్ అప్పట్లో కోర్టులో కేసు వేశారు. తాను కథను తయారు చేసి వర్మకు పోస్ట్ చేశానని కానీ వర్మ నుండి తనకు ఎలాంటి సమాధానం రాలేదని, తీరా 2009లో ఆయన చేసిన ‘అగ్యాత్’ సినిమా చూస్తే అది తన కథేనని అర్థమయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సినిమా టైటిల్స్ లో తన పేరు ఎక్కడా కనబడలేదని, ఆ కథను తాను ఫిల్మ్ రైటర్స్ అసోసియేషన్లో రిజిస్టర్ కూడా చేయించానని అంటూ ఆధారాలతో సహా కోర్టుకి సమర్పించారు. ఆ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం గత రెండేళ్లలో పలు సార్లు వివరణ ఇవ్వాలని వర్మకు సమన్లు పంపింది. కానీ వర్మ వాటిపై స్పందించకపోవడంతో కోర్టు ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తాజాగా తెరకెక్కించిన సర్కార్ 3 సినిమా రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్న వర్మ కోర్టు వారెంట్ కి ఏమని సమాధానమిస్తారో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus