ఎన్టీఆర్ సినిమాల్లో చెప్పే డైలాగులు మాత్రమే కాదు.. ఇంటర్వ్యూల టైమ్ లో మీడియా మిత్రులతో మాట్లాడే విధానం, స్టేజ్ మీద ఇచ్చే స్పీచ్ లు నచ్చనివారుండరు. అలాంటి ఎన్టీఆర్ నేడు “అరవింద సమేత” స్టేజ్ మీద మాట్లాడిన ఒక్కోమాట నోటి నుండి కాక మనసు పొరల్లో నుంచి ఉబికివచ్చినట్లుగా అనిపించడమే కాదు వినిపించాయి కూడా. “12 ఏళ్ల నా కల ఆ మనిషితో సినిమా చేయాలి అని, చాలాసార్లు అనుకున్నాం ఎప్పుడూ కుదరలేదు. ప్రతిసారి ఏదో ఒక చిన్న గ్లిట్చ్ వస్తూ ఉండేది. అదేంటో నాకు, ఆయనకు ఎప్పుడూ అర్ధం కాలేదు. ఆయన “నువ్వే నువ్వే” చిత్రం తీయక ముందు నుంచీ నాకు చాలా దగ్గరైన మిత్రుడు.
ఇదెందుకు కుదరడం లేదు? ఇంత మంచి మిత్రులం, కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగల మిత్రులం, ఎందుకని మా ఇద్దరి కాంబినేషన్ సినిమా కుదరడం లేదని అనుకొనేవాళ్లం. బహుశా నా జీవితంలో నెలక్రితం జరిగిన సంఘటన ఈ సినిమాతో చాలా ముడిపడి ఉందేమో. ఆయనతో సినిమా మొదలెట్టిన తర్వాతే బహుశా జీవితం యొక్క విలువ నాకు అర్ధమైంది. ఈ సినిమా తాత్పర్యం ఒక్కటే.. “ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు, కానీ యుద్ధం ఆపేవాడే మొగాడు, వాడే మొనగాడు” అని. మనిషిగా పుట్టినందుకు ఎంత హూందాగా, ఆనందంగా, మనిషిగా ఎలా బ్రతకాలో చెప్పే చిత్రం “అరవింద సమేత వీరరాఘవ”. మొదట్లో టైటిల్ పెట్టినప్పుడు ఇదేంటి పవర్ ఫుల్ గా లేదు అనుకొన్నారు. కానీ.. ఒక మగాడి పక్కన ఒక ఆడదానికంటే బలం ఇంకోటేదీ ఉండదు.
ఒక గొప్ప చిత్రాన్ని నాకు ఇవ్వడానికే, జీవితం యొక్క విలువ తెలుసుకోవడానికే, నాకు ఆ పరిపక్వత రావడానికే దేవుడు బహుశా ఆగి నేడు ఆయనతో సినిమా చేయించాడేమో. చాలా థ్యాంక్స్ స్వామి. పన్నెండేళ్లలో ఒక స్నేహితుడ్ని చూశాను, ఒక దర్శకుడ్ని చూశాను. కానీ.. సినిమా పూర్తయ్యేలోపు ఒక ఆత్మబంధువుని చూశాను. రేపన్నరోజున నా సుఖదుఖాలలో భాగంగా త్రివిక్రమ్ నిల్చుంటాడు. ఈ సినిమా నా జీవితంలో తప్పకుండా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమాన సోదరుల ముఖంగా చెబుతున్నాను. నా 28 చిత్రాల కెరీర్ లో మొట్టమొదటిసారిగా నా తండ్రికి చితి పెట్టే సన్నివేశంలో నటించాను. ఈ సినిమాకి తమన్ తప్ప ఎవరూ న్యాయం చేయలేరు. జగపతిబాబు లేకపోతే “అరవింద సమేత” లేదు.
ఈ సినిమాకి మరో పిల్లర్ నవీన్ చంద్ర అవుతాడు. మనిషి బ్రతికున్నప్పుడు విలువ తెలియదు, చనిపోయాక తెలుసుకొందామంటే మనిషి మన మధ్య ఉండడు” అంటూ ఎమోషనల్ గా సాగిన ఎన్టీయార్ స్పీచ్ చివర్లో తండ్రి హరికృష్ణను తలుచుకుంటూ.. “ఒక తండ్రికి అంతకంటే అద్భుతమైన కొడుకు ఉండడు, ఒక కొడుక్కి అంతకంటే అద్భుతమైన తండ్రి ఉండదు, ఒక భార్యకి అంతకంటే అద్భుతమైన భర్త ఉండడు, ఒక మనవడికి, మనవరాలికి అంతకంటే అద్భుతమైన తాత ఉండడు, ఈ ఒక్క సినిమా చూడడానికైనా ఆయన ఉండి ఉంటే బాగుండేది. మా నాన్నకిచ్చిన మాటే మీ ఆందరికీ ఇస్తున్నాను ఈరోజు.. మా జీవితం మీకు అంకితం” అంటూ కళ్ల వెంబడి ధారగా వస్తున్న నీళ్ళను తుడుచుకుంటూ తన స్పీచ్ ను ముగించిన తారక్ వెళ్లబోతూ ఆగి.. “మా నాన్నకు ఎలాగో చెప్పలేకపోయాను.. మీ అందరికీ చెప్తున్నాను. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి, మీ కోసం ఎదురుచూస్తా మీ కుటుంబాలు మీకోసం ఉన్నాయి. ఎప్పుడూ చెప్పేది ఒకటేమాట.. నడిరోడ్డు మీద నిల్చోవాల్సిన వచ్చిన రోజు.. మీకు ముందు మీ కుటుంబం, ఆ తర్వాతే మేము. మీరందరూ దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి.. మీ కుటుంబ సభ్యులను పలకరించండి” అని ప్రత్యేకంగా చెప్పడం అభిమానులను మాత్రమే కాదు అక్కడున్న ఆహుతులను, అతిధులను కూడా కన్నీళ్లు పెట్టించింది.