ఎన్టీఆర్ కథానాయకుడు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ నటించి నిర్మించిన చిత్రం “ఎన్టీఆర్ కథానాయకుడు”. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అపూర్వ చరిత్ర దృశ్యకావ్యం ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజైన జనవరి 9న అనగా ఈరోజు విడుదలైంది. మరి ఆ మహనీయుడి చరిత్రను క్రిష్ తో కలిసి ఆయన కుమారుడు బాలకృష్ణ ఏ విధంగా చూపించాడో చూద్దాం..!!

కథ: నందమూరి తారకరామారావు (బాలకృష్ణ) నిమ్మకూరులో సబ్ రిజిష్టార్. రైతు బిడ్డ అయిన తారకరామారావు తన ఉద్యోగం ద్వారా వారికి ఏ విధంగా ఉపయోగపడలేకపోతున్నానే బాధతో.. మారో వారంలో తన మొదటి జీతం అందుకోవాల్సి ఉండగా.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఎల్వీ ప్రసాద్ పిలుపును స్వీకరించి మద్రాసు వెళ్ళిపోతాడు. అక్కడ విజయవాహిని స్టూడియోస్ మరియు కె.వి.రెడ్డిల అండదండలతో వెండితెర ఇలవేల్పుగా ఎదుగుతాడు.

నటుడిగా శిఖరాగ్ర స్థాయిలో ఉన్నప్పటికీ.. ప్రజలను మాత్రం మరువడు రామారావు. అప్పటివరకూ ఎవరూ చేయలేని ప్రయోగాలు, సాహసాలు చేసి అందరి మెప్పు, అభిమానం సంపాదించుకొంటాడు. ఆ ప్రయాణం రాజకీయాలవైపు ఎలా మళ్ళింది, అందుకు కారకులెవరు? అనేది నేపధ్యంతో తొలిభాగమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రానికి తెర పడుతుంది. మరి రాజకీయాల్లో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? మహానాయకుడిగా ఎలా ఎదిగాడు? అనేది ఫిబ్రవరి 8న విడుదలవుతున్న “ఎన్టీఆర్ మహానాయకుడు” చిత్రాన్ని చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: ఒక నటుడిగా నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడనే చెప్పాలి. ముఖ్యంగా.. శ్రీకృష్ణుడిగా బాలయ్యను చూస్తుంటే ఆ ఎన్టీఓడిని చూసిన అనుభూతి కలుగుతుంది. అయితే.. అయిదు పదుల దాటిన తర్వాత ఎన్టీఆర్ లా బాలయ్య అద్భుతంగా సరిపోయాడు కానీ.. 35 ఏళ్ల ఎన్టీఆర్ లా కనిపించడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. ఎన్టీఆర్ ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ ను మక్కీకి మక్కీ దింపేసిన బాలయ్య.. ఉచ్ఛారణ విషయంలో మాత్రం కాస్త తడబడ్డాడు. డబ్బింగ్ చెప్పేప్పుడు జరిగిందా లేక బాలయ్య గొంతే అంత అనేది కన్ఫ్యూజ్ అవుతాం. ఈ రెండు మైనస్ లు తప్పితే ఎన్టీఆర్ పాత్రలో నటించి, ఆయన బయోపిక్ ను నిర్మించి బాలయ్య చరితార్ధుడయ్యాడు.

ఎన్టీఆర్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన పాత్రలో బాలయ్య అద్భుతంగా చేశాడు అని పొగడగలం. కానీ.. రామ తారకం (ఎన్టీఆర్ సతీమణి)ని ఫోటోల్లో చూడడం తప్ప ఆమె వ్యవహార శైలి ఎలా ఉండేదో కూడా తెలియదు మనకి. కానీ.. ఈ సినిమాలో విద్యాబాలన్ ను చూశాక ఆమె అప్పట్లో అలాగే ఉండేదేమో అనిపిస్తుంది. ఆమె మాత్రమే కాదు ఓ సగటు గృహిణి అప్పట్లో అలానే ఉండేదేమో అనిపించకమానదు. భర్త మాట జవదాటని భార్యగా, మగడి మనసెరిగిన పడతిగా విద్యాబాలన్ నటన, స్క్రీన్ ప్రెజన్స్ ప్రశంసార్హం.

వీళ్ళిద్దరి తర్వాత సినిమాలో చెప్పుకోవాల్సిన ఆర్టిస్టులు లెక్కకు మిక్కిలిగా ఉన్నప్పటికీ.. ఎన్టీఆర్ సహోదరుడు త్రివిక్రమరావు పాత్ర పోషించిన దగ్గుబాటి రాజా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆనాటి రాముడి వెనుక నిలిచిన లక్ష్మణుడిలా ఆయన అభినయం ప్రేక్షకుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుంది.

హరికృష్ణ రౌద్రాన్ని ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ చక్కగా పలికించగా.. ఎన్టీఆర్ కి అత్యంత ఆప్త మిత్రుడైన ఏయన్నార్ పాత్రలో చాలా సెటిల్డ్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు సుమంత్. చాలా సందర్భాల్లో సుమంత్ ను చూస్తుంటే ఏయన్నార్ ను చూస్తున్నట్లుగానే ఉంటుంది తప్ప ఆ పాత్ర పోషిస్తున్నది సుమంత్ అనేది గుర్తుకురాదు. కె.వి.రెడ్డిగా క్రిష్, విజయవాహిని స్టూడియోస్ అధినేతలు నాగిరెడ్డి-చక్రపాణీలుగా ప్రకాష్ రాజ్-మురళీశర్మ ఒదిగిపోయారు. శ్రీదేవిగా రకుల్, జయప్రదగా హన్సిక ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా జ్ణానశేఖర్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. అలనాటి ఫ్రెమింగ్స్ ను ఆయన రీక్రియేట్ చేసిన తీరు, ఒక చరిత్ర చూస్తున్నామనే భావన ప్రేక్షకుల్లో కలిగించడం కోసం లైటింగ్ & టింట్ విషయంలో ఆయన తీసుకొన్న జాగ్రత్తలు అభినందనీయం. బాలకృష్ణ ఏ యాంగిల్ లో ఎన్టీఆర్ లో ఉంటాడో గుర్తించి ఆ యాంగిల్ లోనే మాగ్జిమమ్ షాట్స్ ప్లాన్ చేసుకొన్నాడు జ్ణానశేఖర్. కీరవాణి సంగీతం ప్రేక్షకుల్ని సినిమాలో మరింతగా లీనం చేసింది. ముఖ్యంగా బంటురీతి కొలువు, వెండితెర దొర పాటలు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఒక తెలియని ఉద్వేగానికి లోనవుతాము. ఎడిటర్ అర్రం రామకృష్ణ పనితనం సినిమాకు కొంత ప్లస్, కొంత మైనస్ కూడా అయ్యింది. అన్నగారు అప్పట్లో పడిన కష్టం ప్రేక్షకులకు తెలియాలనే తపనతో కొన్ని సీన్స్ ను ల్యాగ్ చేశారు.

ఇక బుర్రా సాయిమాధవ్ మరోసారి తన కలం బలం ప్రదర్శించారు. అతి అనిపించే ఎలివేషన్ డైలాగ్స్ లేవు, పొగిడేసే పద్యాల్లాంటి దండకాలు లేవు. ఉన్నవల్లా.. సందర్భానుసారంగా వచ్చే మాటలు మాత్రమే. అయితే.. ఆ మాటలే మనసుకి హత్తుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో చాలా పెద్ద భావాన్ని కూడా రెండే రెండు మాటల్లో ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్పిన ఆయన కలం గొప్పదనాన్ని ఎంత పొగిడినా తక్కువే.
ఇక మన కెప్టెన్ ఆఫ్ ది షిప్ క్రిష్ జాగర్లమూడి విషయానికి వస్తే..

తాను ప్రొజెక్ట్ టేకప్ చేసే సమయానికే కథ సిద్ధంగా ఉండడం వల్లనో లేక తాను మళ్ళీ రాసిన కథను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నాడో తెలియదు కానీ.. ఒక బయోపిక్ కు కావాల్సిన రీసెర్చ్ కనిపించలేదు.. కేవలం ఎన్టీఆర్ అనే వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతని మొండి ధైర్యాన్ని, వెన్నుచూపని స్వభావాన్ని, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే మొక్కవోని ధైర్యాన్ని మాత్రమే తెరపై ప్రెజంట్ చేయగలిగాడు. అయితే.. వీటన్నిటికీ కారణమైన యాటిట్యూడ్ ను ఆయన ఎలా పుణికిపుచ్చుకున్నాడు అనేది మాత్రం చూపించలేదు. ఆ కారణంగా సినిమా బాగుంది అని మనసు చెబుతున్నప్పటికీ.. మెదడులో ఎక్కడో ఏదో తెలియని వెలితి. అయితే.. ఆ వెలితిని కవర్ చేయడం కోసం కథను బసవతారకం పాయింటాఫ్ వ్యూలో మొదలెట్టాడు. అప్పుడైతే.. కేవలం ఆమెకు తెలిసిన విషయాలను మాత్రం సినిమాలో చూపించవచ్చు అనే సౌలభ్యం క్రిష్ కి లభించింది.

కానీ.. రామారావు కృష్ణుడిగా బాగోడు అని నాగిరెడ్డి-చక్రపాణిలు గొడవపడడం, వాళ్ళని కె.వి.రెడ్డి కన్విన్స్ చేయడానికి ప్రయత్నించే సందర్భంలో బాలకృష్ణను శ్రీకృష్ణుడిలా ప్రెజంట్ చేసిన తీరు, ఆ సన్నివేశానికి ఇచ్చిన ఎలివేషన్ మాత్రం అద్భుతం. అలాగే.. కథానాయకుడు మహానాయకుడిగా రూపాంతరం చెందే సందర్భాలను పిక్చరైజ్ చేసిన తీరు కూడా బాగుంది. ముఖ్యంగా.. దీవిసీమ కష్టాలు ఎన్టీఆర్ లో ఆలోచనాగ్నిని రగిలించిన విధానాన్ని తెరపై చూపించిన విధానం అభినందనీయం.

ఓవరాల్ గా ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ కి మంచి లీడ్ ఇచ్చాడు క్రిష్. సో సెకండ్ పార్ట్ కోసం నందమూరి అభిమానులు మాత్రమే కాదు ప్రతి తెలుగు ప్రేక్షకుడు ఆశగా ఎదురుచూస్తాడు. అలా వెయిట్ చేసేలా చేశాడు క్రిష్.

విశ్లేషణ: ఇది లోకం ఎరిగిన చరిత్ర. తెలిసిన వాళ్ళకు పరమాన్నం లాంటి సినిమా “ఎన్టీఆర్ కథానాయకుడు”, తెలియనివారికి మాత్రం విందు భోజనం లాంటిది. అయితే.. ప్రతి నాణానికి రెండోవైపు ఉంటుంది. క్రిష్ ఆ రెండో వైపును చూపించాలనుకోలేదు, నందమూరి అభిమానులు కూడా ఆ మరోవైపును చూడడానికి ఇష్టపడరనుకోండి. అందువల్ల.. ఒక చక్కని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “ఎన్టీఆర్ కథానాయకుడు” చిత్రాన్ని కుటుంబ సమేతంగా థియేటర్లో చూడండి.

రేటింగ్: 3/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus